Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: నాన్నల అమెరికా ప్రేమ.. పిల్లల అవస్థలు

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:29 AM GMT
టీజర్ టాక్: నాన్నల అమెరికా ప్రేమ.. పిల్లల అవస్థలు
X
ఈమధ్య నవతరం ఫిలిం మేకర్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇదే కోవలో దాదాపుగా కొత్త టీమ్ తో తెరకెక్కిన న్యూ జెనరేషన్ ఫిలిం 'ప్రెజర్ కుక్కర్'. సుజోయ్ & సుశీల్(అమెరికా రిటర్న్డ్) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రోనక్.. ప్రీతీ అస్రాని.. రాహుల్ రామకృష్ణ.. రాజై రోవన్.. కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది.

సినిమా కాన్సెప్ట్ ను దాచిపెట్టకుండా స్ట్రెయిట్ గా చెప్పారు. దాదాపుగా అందరిళ్ళలో ఉండే గోలే ఇది.. "చదవండి చదవండి చదవండి.. అమెరికాకు పోయి ఎంఎస్ చెయ్యండి.. సెటిల్ అవ్వండి". స్థూలంగా ఇదీ కాన్సెప్ట్. టీజర్ స్టార్టింగ్ లోనే హీరోకు వీసా ఇంటర్వ్యూ.. "అమెరికాలోనే ఎందుకు చదవాలని అనుకుంటున్నారు?" అని లేడీ ఆఫీసర్ అడుగుతుంది. "ఎందుకంటే అది మా నాన్న కల" అని హీరో బదులిస్తాడు. ఇక్కడే అర్థం అయింది కదా నాన్న కల వేరు.. కొడుకు కల వేరు. అమెరికా పోవడం కొడుకు కల కాదు. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చిన్నబాబు గా ఉన్న సమయం నుంచి హీరో నాన్నగారు అమెరికాపట్ల కొడుక్కి ఆసక్తి కలిగించేందుకు అమెరికాలోని స్టేట్స్ పేర్లు చెప్పడంలాంటివి చేస్తుంటాడు.

మరో సీన్ లో హీరో ఫ్రెండ్ గా రాహుల్ రామకృష్ణ హీరో నాన్నగారికి "అమెరికా పోవడం లో అంత పెద్ద మజా లేదంకుల్. ఇక్కడే హైదరాబాద్ లో వీడు ఏదైనా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తే బాగుంటుంది" అని నచ్చచెప్పాలని చూస్తాడు. ఈ నాన్నలున్నారే వారికి అసలు దేశభక్తి ఉండదు.. ఎప్పుడూ అమెరికా భక్తి ..డాలర్ ప్రేమే ఉంటుంది. అందుకే రాహుల్ ను ఛీ పాపి.. తెలివిలేనోడా.. అన్నట్టుగా గుర్రుగా చూస్తాడు. ఇది వరస. మరి ఇలాంటి పరిస్థితి నుండి హీరో ఎలా బయట పడ్డాడు.. అమెరికాకు పోకుండా ఎలా బతికిపోయాడు అన్నది కథ. అంతా ఇదే అయితే ఎలా? అందుకే ఇక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఓవరాల్ గా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాలో పాత్రలు హైదరాబాద్ యాసలో మాట్లాడడంతో న్యాచురల్ గా అనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.. ప్రెజర్ కుక్కర్!