Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: రౌడీయిజంలో నెపోటిజం చూపిస్తున్న 'గల్లీ రౌడీ'

By:  Tupaki Desk   |   19 April 2021 12:50 PM GMT
టీజర్ టాక్: రౌడీయిజంలో నెపోటిజం చూపిస్తున్న గల్లీ రౌడీ
X
యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గల్లీ రౌడీ''. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో సందీప్ సరసన నేహా హరిరాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'గల్లీ రౌడీ' టీజర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేశాడు.

'బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు' అని పోసాని కృష్ణ మురళి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. వంశపారంపర్యంగా ఫ్యామిలీలో వస్తున్న రౌడీయిజం అంటే ఇష్టం లేని హీరో సందీప్.. హీరోయిన్ ఫ్యామిలీ కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం వల్ల అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎంటనేది ఇందులో చూపించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. 'ఎవరైనా వాళ్ళ మనవడికి ఇంజినీర్ ని చేస్తాడు డాక్టర్ ని చేస్తాడు.. బాగా బలిసి కొట్టుకుంటే ఎమ్మెల్యేని చేస్తాడు.. ఈ రౌడీని చేయడం ఏంటి రా?' అని హర్ష అనగా.. 'నెపోటిజం రా' అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది.

ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - అన్నపూర్ణమ్మ - వైవా హర్ష - నాగినీడు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం మీద హాస్యభరితంగా సాగిన 'గల్లీ రౌడీ' టీజర్ విశేషంగా అలరిస్తోంది. చౌరస్తా రామ్‌ మిరియాల - సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ - ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ 'గల్లీ రౌడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.