Begin typing your search above and press return to search.

టీజర్: అంటే.. సుందరానికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయా..?

By:  Tupaki Desk   |   20 April 2022 6:19 AM GMT
టీజర్: అంటే.. సుందరానికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయా..?
X
'శ్యామ్ సింగరాయ్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ''అంటే సుందరానికీ!". టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ రోమ్-కామ్ తెరకెక్కింది. ఇందులో మలయాళ భామ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ ‏గా నటించింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. దీంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'అంటే సుందరానికీ' చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన 'పంచెకట్టు' ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. నాని ని సరికొత్త లుక్ ‏లో ప్రెజెంట్ చేయబోతున్న టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈరోజు బుధవారం హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.

టీజర్ విషయానికొస్తే.. సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో చూసుకుంటున్నారు. కాకపోతే వారు విపరీతమైన కేరింగ్ తీసుకోవడం వల్ల సుందర్ ఇబ్బందులు పడుతున్నాడు.

అతని లైఫ్ లో ఏది జరిగినా జాతకంతో లింక్ పెడుతూ జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటున్నారు. గండాలు ఉన్నాయని చెబుతూ తరచుగా బలవంతంగా హోమాలు చేయిస్తున్నారు. అలాంటి బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుందర్.. లీలా థామస్‌ అనే క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు.

రెండు కుటుంబాలు కూడా కులం మతం గురించి పట్టింపు ఉన్నవారు కావడంతో.. వీరి ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది. కానీ ఇవి కాకుండా సినిమాలో ఇంకేదో ఉందనే క్యూరియసిటీ పెంచేలా 'అంటే.. సుందరానికి' టీజర్ కట్ చేయబడింది. అసలు విషయం చెప్పకుండా సుందరం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. ఇందులో వివేక్ ఆత్రేయ మార్క్ రైటింగ్.. టేకింగ్ కనిపిస్తోంది.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు కెమెరా మ్యాన్ నికేత్ బొమ్మి విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ దీనికి నిర్మాతలు. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా.. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు.

నాని ఎప్పటిలాగానే తన ట్రేడ్‌ మార్క్ డైలాగ్ టైమింగ్ తో అలరించాడు. మరోవైపు నజ్రియా నజీమ్‌ చాలా అందంగా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. నాని - నరేష్ కాంబోలో సీన్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

ఈ వినోదాత్మక టీజర్‌ తో సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు. ''అంటే సుందరానికీ!" చిత్రాన్ని 2022 జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో విడుదల చేయనున్నారు. తమిళంలో 'ఆడదే సుందరా'.. మలయాళంలో 'ఆహా సుందరా' అనే పేర్లతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.