Begin typing your search above and press return to search.

యాంగ్రీ యంగ్ మెన్‌.. ఓ ప‌వ‌ర్ హౌస్‌!

By:  Tupaki Desk   |   11 Oct 2022 12:46 PM GMT
యాంగ్రీ యంగ్ మెన్‌.. ఓ ప‌వ‌ర్ హౌస్‌!
X
బిగ్ బి.. అమితాబ్ బ‌చ్చ‌న్. ఇండియ‌న్‌ సినీ ల‌వ‌ర్స్ కి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరిది. ముందు హీరోగా ప‌నికి రావ‌న్నారు.. బాబోయ్ ఇంత హైటా.. ఆ గొంతేంటీ.. నువ్వు హీరోగానా.. అంటూ ఎంతో మంది ఎన్నో ర‌కాలుగా అమితాబ్ ని అవ‌మానించారు. హేళ‌న చేశారు. అయినా స‌రే ఎక్క‌డ అవ‌మానించ‌బ‌డ్డానో అక్క‌డే జేజేలు అందుకోవాల‌ని నిశ్చ‌యించుకుని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. భారతీయ సినీమాకే సూప‌ర్ స్టార్ అయ్యారు.

నేడు అమితాబ్ పుట్టిన రోజు. మంగ‌ళ‌వారంతో 80వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఎందుకు ప‌నికిరాడ‌న్న వారి చేతే యాంగ్రీ యంగ్ మాన్ అనిపించుకున్న తిరుగులేని న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌. భార‌తీయ సినిమాల‌కు ఎన్నో మ‌ర‌పురాని మ‌ర్చిపోలేని ఎవ‌ర్ గ్రీన్ సినిమాల‌ని అందించి భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో త‌న పేరుని సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్నారు. భార‌తీయ సినిమా అంటే బిగ్ బి.. బిగ్ బి అంటే ఇండియ‌న్ సినిమాగా అవ‌త‌రించారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా ప్ర‌త్యేక‌ గుర్తింపుని సొంతం చేసుకుని యునానిమ‌స్‌గా సూప‌ర్ స్టార్ గా జేజేలు ప‌లికిన అమితాబ్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. 70వ ద‌శ‌కంలో వ‌చ్చిన `సాత్ హిందుస్తానీ`తో ఉత్త‌మ నూత‌న న‌టుడిగా జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకుని అంద‌రిని అబ్బుర‌ప‌రిచారు. దీవార్‌, షోలే వంటి సినిమాల‌తో యావ‌త్ భార‌తాన్ని ఉర్రూత‌లూగించారు. 70వ ద‌శ‌కం ప్రారంభం నుంచి 99 వ‌ర‌కు భార‌తీయ సినిమాకు యాంగ్రీ యంగ్ మెన్ గా ఓ వెలుగు వెలిగారు.

ఇక `హిందూస్థాన్ కి క‌స‌మ్‌` మూవీతో ప్రాధాన్య‌త వున్న కీల‌క పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచి స‌రికొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే వుంది. ప్ర‌స్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ `ప్రాజెక్ట్ కె`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీపికా ప‌దుకోన్‌, దిషా ప‌టానీ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 11 బిగ్ బి పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని `ప్రాజెక్ట్ కె` టీమ్ ప్ర‌త్యేక పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది.

పిడికిలి బిగించి క‌నిపిస్తున్న హ్యాండ్ ని మాత్ర‌మే పోస్ట‌ర్ లో రివీల్ చేసిన టీమ్ `లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్ట‌ల్` అంటూ బిగ్ బి కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేసింది. అంతే కాకుండా 5 ద‌శాబ్దాల‌కు పైగా అల‌రించిన ప‌వ‌ర్ హౌస్ మీరు ఈ సారి ఆవిష్క‌రించిన కొత్త అవ‌తారం ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌కుండా వేచి వుండ‌లేక‌పోతున్నాం. ఇది 80వ పుట్టిన రోజు. ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాలి. శ‌క్తిని మీతో ఎల్ల‌ప్పుడూ వుండ‌నివ్వండి. మా వెన‌కున్న ఫోర్స్ మీరే బ‌చ్చ‌న్ స‌ర్‌` అంటూ బిగ్ బిపై త‌మకున్న ప్రేమ‌ని ప్ర‌ద‌ర్శించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.