Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:30 PM GMT
గాడ్ ఫాదర్ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ''గాడ్ ఫాదర్'' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. 'తనివరువన్' ఫేమ్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. అయితే చిరు నటిస్తున్న ఈ 153వ సినిమాకు సంబంధించి ఓ రూమర్ వినిపిస్తోంది.

మలయాళ వెర్సన్ లో కీలమైన హీరో సోదరి పాత్రలో మంజు వారియర్ నటించింది. ఇప్పుడు తెలుగులో చిరంజీవి చెల్లెలి రోల్ కోసం స్టార్ హీరోయిన్ నయనతార తో చర్చులు జరుపుతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నయన్ ను ఈ ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి మేకర్స్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆమె ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని.. ఈ ప్రాజెక్ట్‌ లో భాగం కావడం లేదని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమవడంతో ఇప్పటికిప్పుడు ఆ పాత్రకు సరిపోయే నటి ని తీసుకురావడం మేకర్స్ కు కాస్త కష్టమైన పనే అని చెప్పాలి. అందుకే 'గాడ్ ఫాదర్' మేకర్స్ ఆ పాత్రను సినిమా నుండి తొలగించాలని నిర్ణయించుకున్నారని.. మొత్తం ట్రాక్‌ ను తిరిగి రాశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు చెల్లెలి పాత్రకు సంబంధించిన సీన్స్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టి మిగతా షూటింగ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని.. తర్వాత ఆ క్యారక్టర్ గురించి ఆలోచిస్తారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

వాస్తవానికి 'లూసిఫర్' చిత్రానికి 'గాడ్ ఫాదర్' రీమేక్ అయినప్పటికీ.. మాతృకలోని ప్లాట్ ను మాత్రమే తీసుకొని మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్లుగా మార్పులు చేశారు. చిరంజీవి సినిమా నుంచి మెగా అభిమానులు ఏమేమి ఆశిస్తారో అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు మోహన్ రాజా ఈ హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ రీమేక్ ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన యాక్షన్ ప్యాక్డ్ టైటిల్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.