Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్.. టీడీపీని షేక్ చేస్తోన్న వర్మ

By:  Tupaki Desk   |   29 Jan 2019 8:49 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్.. టీడీపీని షేక్ చేస్తోన్న వర్మ
X
జనాలు ఎప్పుడు విజయాలపై కంటే వివాదాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ‘ఎన్టీఆర్’ మూవీనే.. బాలక్రిష్ణ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాలను బయోపిక్ గా తీయడానికి సంకల్పించారు. ఆయన ఎదిగిన తీరును అద్భుతంగా ఆవిష్కరించారు. కానీ అందులో ప్రేక్షకులకు కావాల్సిన వివాదాలు, ఆసక్తికర కథనం లేకపోవడంతో మూవీ డీలా పడింది.

అదే సమయంలో మహానటి సావిత్రి మూవీని రీచ్ కావడానికి కూడా ఎన్టీఆర్ ఆపసోపాలు పడుతోంది. నిజానికి మహానటి మూవీలో సావిత్రి ఎలా ఎదిగిందో మొదటి పార్ట్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమాల్లో ఆమె ఎలా పొగొట్టుకుంది.? ఎంత దుర్భరంగా చనిపోయిందో రెండోపార్ట్ లో చూశారు. అలాంటి వివాదాస్పద కఠిన వాస్తవాలు చెప్పడంలో ఎన్టీఆర్ బయోపిక్ విఫలమైంది. కాబట్టే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందన్న విమర్శలున్నాయి.

ప్రేక్షకులు ఎప్పుడు విజయాలపై కంటే వివాదాలను ఎక్కువగా ఇష్టపడుతారనడానికి ఎన్టీఆర్, మహానటి మూవీలే నిదర్శనం. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వివాదాల రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీపై అందరి ఫోకస్ నెలకొంది.

ప్రేక్షకులు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపిస్తానని వర్మ ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక.. ఆయన చనిపోవడానికి ముందు జరిగిన ‘వైస్రాయ్ హోటల్’ రాజకీయాలన్నీ వర్మ చూపిస్తామనడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ఆ రోజుల్లో ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఏపీ సీఎం చంద్రబాబు సహా నాటి టీడీపీ సీనియర్లు ఇరుకునపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఎన్నికల ముందు టీడీపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెన్నుపోటు పాటతోనే చంద్రబాబుకు జలక్ ఇచ్చిన వర్మ ఆ పాట చేసిన వివాదంతో సినిమాకు టీడీపీ నేతలతోనే ప్రచారం కల్పించుకున్నారు. ఇప్పుడు అదే వేడిలో సినిమా విడుదల చేసి సినిమాను హిట్ కొట్టించాలని వర్మ వేచిచూస్తున్నారు. సినిమాను టీడీపీ నేతలు వ్యతిరేకించి ఆందోళన చేసే అవకాశాలుండడంతో వర్మ సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ దక్కుతుందని వర్మ భావిస్తున్నాడు. ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ శిబిరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ఈ సినిమావల్ల తమకు నష్టం జరిగే అవకాశాలుండడంతో సినిమాను అడ్డుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు.