Begin typing your search above and press return to search.

తరుణ్ మీద ఒక లుక్కేయండి సార్లూ..

By:  Tupaki Desk   |   15 Feb 2018 11:03 AM IST
తరుణ్ మీద ఒక లుక్కేయండి సార్లూ..
X
ఒక ‘నువ్వే కావాలి’.. ఒక ‘నువ్వు లేక నేను లేను’.. ఒక ‘ప్రియమైన నీకు’.. ఒక ‘నువ్వే నువ్వే’.. ఇవన్నీ ఒకప్పుడు యువ ప్రేక్షకుల హృదయాల్ని గిలిగింతలు పెట్టిన సినిమాలు. ఆ సినిమాలతో తరుణ్ అప్పట్లో ఎంత మంచి పేరు సంపాదించాడో.. యూత్ లో అతడి క్రేజ్ ఎలా ఉండేదో ఆ తరం వాళ్లకు బాగా తెలుసు. క్లాస్ సినిమాలతోనే స్టార్ గా ఎదిగిన తరుణ్ ఇంకా పెద్ద స్థాయికి చేరుతాడని అనుకుంటున్న సమయంలో వరుస ఫ్లాపులతో పతనమైపోయాడు. గత కొన్నేళ్లలో తరుణ్ గురించి టాలీవుడ్లో డిస్కషనే లేదసులు. ఇప్పుడు చాలా విరామం తర్వాత ‘ఇది నా లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల్ని పలకరించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.

సినిమాగా చెప్పుకోవడానికి ‘ఇది నా లవ్ స్టోరీ’లో ఏం లేదు. ఇదొక బోరింగ్ లవ్ స్టోరీ అనే విషయంలో మరో అభిప్రాయమే లేదు. ఏ ప్రత్యేకతా లేని ఈ సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణ తరుణ్ నటనే. చాలా గ్యాప్ వచ్చినా.. వరుస ఫ్లాపులతో ఫాలోయింగ్ మొత్తం పోగొట్టుకున్నా తరుణ్ ఈ సినిమాలో ఆత్మవిశ్వాసంతోనే నటించాడు. నటుడిగా తన పరిణతి చూపించాడు. గత సినిమాలతో పోలిస్తే తరుణ్ లుక్స్ కూడా ఇందులో బాగున్నాయి. కొన్ని చోట్ల వింటేజ్ తరుణ్ గుర్తుకొచ్చాడు తరుణ్. తన ఫామ్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటికీ తాను మంచి పాత్ర.. మంచి సినిమా పడితే సత్తా చాటుకోగలనని తరుణ్ రుజువు చేశాడు. ఈ సమయంలో ఈ తరం దర్శకులు ఎవరైనా అవకాశమిస్తే తరుణ్ కచ్చితంగా తన ప్రత్యేకత చాటుకోగలడు. హీరోగా కాకపోయినా స్పెషల్ క్యారెక్టర్లు ఇచ్చినా తరుణ్ నిలదొక్కుకోగలడు. ఈ విషయంలో తరుణ్ కు సైతం బేషజాలేమీ లేకపోవచ్చు. మరి అతడికి ఆ అవకాశాలు ఎవరిస్తారు?