Begin typing your search above and press return to search.

తార‌క్ న్యూ లుక్.. కొంప‌దీసి ఆ సీక్వెల్ కోస‌మా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 PM GMT
తార‌క్ న్యూ లుక్.. కొంప‌దీసి ఆ సీక్వెల్ కోస‌మా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని జ‌క్క‌న్న బంధిఖానా నుంచి రిలీవ్ అయిపోయారు. టాకీ పార్ట్ స‌హా పాటల చిత్రీక‌ర‌ణ కూడా ముగించి ఫ్రీబ‌ర్డ్ అయ్యారు. దీంతో కొమ‌రం భీమ్ పాత్ర నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. ఇక సినిమాకి సంబంధించి త‌న పాత్ర వ‌ర‌కూ డ‌బ్బింగ్ ఒక్క‌టే బ్యాలెన్స్ ఉంది. రాజ‌మౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టూడియోకి వెళ్లి ఆ ప‌ని పూర్తిచేయ‌డ‌మే త‌రువాయి.

ఈ నేప‌థ్యంలో తార‌క్ మ‌ళ్లీ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు` షోలో బిజీ అయ్యారు. త‌న‌దైన చ‌రిష్మాతో మ‌ళ్లీ బుల్లి తెర ప్రేక్ష‌కుకుల్ని అల‌రిస్తున్నారు. షూట్ లో భాగంగా తార‌క్ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు` నిర్వాహ‌కుల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తార‌క్ కొత్త లుక్ ఒక‌టి లీకైంది. ఇందులో తార‌క్ `జ‌న‌తా గ్యారేజ్` ..`బృందావ‌నం` త‌ర‌హా లుక్ లో సాప్ట్ గా క‌నిపిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంది. తార‌క్ ఇంత సాప్ట్ గా క‌నిపిస్తున్నాడు ఏంటి ? అని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌తా గ్యారేజ్ పాయింట్ కి ముడిపెట్టి మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ త‌దుప‌రి అదే ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ జోడీ `జ‌న‌తా గ్యారేజ్ ` సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారా? అంటూ గుస‌గుస మొద‌లైంది. కొర‌టాల హీరోల్ని ఆన్ స్క్రీన్ పై ఎంత అందంగా చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌తో ప‌నిచేసిన హీరోలు తెర‌ పై స్మార్ట్ లుక్ లో కనిపిస్తారు. కొర‌టాల వ‌ద్ద హీరోల్ని అలా డిజైన్ చేసే డిజైన‌ర్లు ఉంటారు. ఎలాంటి మాస్ పాత్ర‌లోనైనా హీరోని స్మార్ట్ గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని త‌న‌ చిత్రాలే చెబుతుంటాయి. మ‌రి తాజా రూమ‌ర్ ఎంత వ‌ర‌కూ నిజ‌మో వేచి చూడాలి. కొర‌టాల సీక్వెల్ క‌థ‌ల మూడ్ లో ఉన్నారా.. లేక ఒరిజిల్ క‌థ‌ల‌తో కొత్త వాటితోనే ముందుకు వెళుతున్నారా? అన్న‌ది కూడా ఆయ‌నే వెల్ల‌డించాల్సి ఉంది.