Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: 7గంటల పాటు జరిగిన విచారణలో తనీష్ ఏం చెప్పాడంటే..?

By:  Tupaki Desk   |   18 Sep 2021 7:30 AM GMT
డ్రగ్స్ కేసు: 7గంటల పాటు జరిగిన విచారణలో తనీష్ ఏం చెప్పాడంటే..?
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీల్యాండరింగ్ కోణాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఈ కేసులో విచారించగా.. నిన్న శుక్రవారం హీరో తనీష్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన తనీష్.. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు. దాదాపు 7 గంటల పాటు జరిగిన విచారణలో డ్రగ్స్ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన సప్లయిర్ కెల్విన్ తో ఉన్న పరిచయం గురించి.. అతడితో జరిపిన లావాదేవీలపై తనీష్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గతంలో తనీష్ - కెల్విన్ మధ్య జరిన వాట్సాప్ చాటింగ్ పై వివరణ కోరారని తెలుస్తోంది. ఎఫ్ క్లబ్ వ్యవహారాల పైనా ఆరా తీశారు. యువ హీరో సమర్పించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ - ఆడిట్ రిపోర్ట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించారు. అయితే ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని.. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తనీష్ స్పష్టం చేశారు.

గతంలో తన సినిమాలకు కెల్విన్ ఈవెంట్లు నిర్వహించాడని.. ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని.. అంతేకానీ డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తనీష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తన పేరు బయటకు రావడానికి కెల్విన్ తో ఈవెంట్స్ పరంగా ఉన్న పరిచయమే కారణమని తనీష్ వివరణ ఇచ్చారు. ఈడీ విచారణ ముగిసిన తర్వాత తనీష్ మీడియాతో మాట్లాడారు. ఈడీ కోరిన కొన్ని డాక్యుమెంట్లు అందించానని.. మరోసారి విచారణకు రావాలని అధికారులు చెప్పలేదని.. ఒకవేళ పిలిస్తే కచ్చితంగా పూర్తి సహకారం అందిస్తానని తనీష్ పేర్కొన్నారు.

కాగా, టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ - ఛార్మి కౌర్ - రకుల్‌ ప్రీత్ సింగ్ - దగ్గుబాటి రానా - రవితేజ - నవదీప్ - నందు - ముమైత్ ఖాన్ - తనీష్ లను ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 22 బుధవారం హీరో తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. మరో వైపు డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు రావాలని ఆదేశించింది.