Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాకు మగతనం తెస్తున్నారు

By:  Tupaki Desk   |   28 July 2016 5:15 AM GMT
తెలుగు సినిమాకు మగతనం తెస్తున్నారు
X
తాను అనుకున్న మాటల్ని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే దమ్ము.. ధైర్యం ఉన్న టాలీవుడ్ ప్రముఖుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పొగడ్త తప్ప తెగడ్త అన్నది మాట వరసకు కూడా వినిపించని పరిస్థితుల్లో.. ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో మగాళ్లు లేరు’’ అన్న సంచలన వ్యాఖ్య చేయటం.. ఆ మాట మీదే నిలబడటం తమ్మారెడ్డికే చెల్లింది. అలాంటి ఆయన తాజాగా మరోఆసక్తికర వ్యాఖ్య చేశారు. గతంలో తాను చెప్పిన ‘తెలుగు ఇండస్ట్రీలో మగాళ్లు లేరు’’ అంటూ చెప్పిన మాటల్ని తాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మగతనం లేదని చెప్పటం పురుషాహంకారమో.. సెక్సిస్ట్ రిమార్కో కాదని.. ధైర్యంగా వినూత్నమైన సినిమాలు తీసే సత్తా.. వాటిని కన్విన్సింగ్ గా ప్రేక్షకులకుచె చెప్పే తీరు లేకపోవటమని.. మూస ధోరణితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాపై నిరసనతోనే తానీ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పిన ఆయన.. గడిచిన ఐదారేళ్లుగా తెలుగుసినిమాలో వస్తున్న మార్పులతో తాను సంతోషిస్తున్నానన్నారు. తాజాగా పెళ్లిచూపులు సినిమా చూశాక.. తాను ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.

‘‘నా స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునే సమయం వచ్చేసిందనిపిస్తోంది. మెల్లిగా మొలతాడు కట్టిన మగాళ్లు పుట్టుకొస్తున్నారు. తెలుగు సినిమాకి మగతనం తెస్తున్నారు. అష్టాచెమ్మా చూసినప్పుడు మనోళ్లు కొత్తగా ఆలోచిస్తున్నారనుకున్నా. సున్నితమైన భావాలు కలిగిన సినిమాలు ఆడవనుకున్న టైమ్ అది. కానీ.. ప్రేక్షకులు తమ టేస్ట్ బాగుందని నిరూపించారు. కమర్షియల్ స్టార్స్ తో స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా చేయొచ్చని వేదంతో క్రిష్ ప్రూవ్ చేశారు. హీరోలుంటేనే తెలుగు సినిమా అనుకునే సమయంలో ఈగ దోమా కూడా హీరో అయిపోవచ్చని బాక్సాఫీసు దగ్గర ప్రూవ్ చేసిన సినిమా ఈగ. ఇష్క్.. మనం.. ఎక్స్ ప్రెస్ రాజా.. రన్ రాజా రన్.. ఒక ప్రేమకథా చిత్రమ్.. ఉయ్యాల జంపాలా చిత్రాలతో కొత్త పోకడలు వస్తున్నాయి. అలానే తాజా పెళ్లి చూపులు చిత్రం ఒక పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డిని అంతగా ఇంప్రెస్ చేసిన పెళ్లిచూపులు ఎలా ఉంటందో చూడాలి మరి.