Begin typing your search above and press return to search.

తమ్మారెడ్డికి దాసరికి అంత పెద్ద గొడవా?

By:  Tupaki Desk   |   21 May 2018 9:40 AM IST
తమ్మారెడ్డికి దాసరికి అంత పెద్ద గొడవా?
X
ఇటీవలే దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకల్లో ఆయన గురించి సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎంత బాగా మాట్లాడాడో తెలిసిందే. దాసరితో తనకున్న అనుబంధం గురించి.. తమ మధ్య జరిగిన సంభాషణల గురించి ఆయన వివరించారు. దాసరికి అంత క్లోజ్ అయిన తమ్మారెడ్డి ఒకప్పుడు దాసరితో అస్సలు పడలేదట. దాసరి గొప్ప స్థాయిలో ఉన్నపుడు కయ్యం పెట్టుకుని ఆయనతో కొంత కాలం పాటు మాట్లాడకుండా ఉండినట్లు తమ్మారెడ్డి తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించారు. దాసరితో తనకు పెద్ద స్థాయిలోనే గొడవ అయిందని ఆయన చెప్పారు.

మొదట్లో దాసరికి తాను చాలా సన్నిహితుడినని.. ఆయన ఏ కథ రాసినా ముందు తనకే వినిపించి అభిప్రాయం తెలుసుకునేవారని.. సినిమా పూర్తయ్యాక కూడా చూపించేవారని.. ఇంకా తనకు చాలా ప్రయారిటీ ఇచ్చేవారని తమ్మారెడ్డి చెప్పారు.

ఐతే తన శిష్యుడైన రేలంగి నరసింహారావును దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నపుడు తనకు ఆయనకు గొడవ తలెత్తిందన్నారు. రేలంగి తొలి సినిమాను నిర్మించమని తనకు చెప్పడంతో తాను సన్నాహాలు చేసుకున్నానని.. కానీ అంతా సిద్ధమయ్యాక రేలంగి తెచ్చిన కథ నచ్చక పక్కన పెట్టారని చెప్పారు. ఈ విషయంపై దాసరిని అడగడానికి వెళ్తే తనను గంటసేపు వెయిట్ చేయించడంతో తనకు కోపం వచ్చి వెనక్కి వచ్చేశానన్నారు. రేలంగితో ‘మరో కురుక్షేత్రం’ పేరుతో అదే సినిమా నిర్మించడానికి రెడీ అయ్యానని.. ఈలోపు దాసరి తన బేనర్లో వేరే దర్శకుడితో అదే కథతో సినిమా చేయడానికి సంకల్పించుకుని సినిమా అనౌన్స్ చేశారన్నారు. తాను కూడా తగ్గకుండా సినిమా ప్రకటించానని.. ఈ విషయమై గొడవ చాలా దూరం వెళ్లిందని తెలిపారు. చివరికి దాసరి తనను పిలిపించి.. నిన్ను ఇంత నమ్మితే ఇంత అల్లరి చేస్తావా అని తిట్టారని.. తాను కూడా గట్టిగానే సమాధానం చెప్పారని.. చివరికి ఎలాగోలా సమస్య పరిష్కారమై తామిద్దరం మళ్లీ కలిసిపోయామని తమ్మారెడ్డి వెల్లడించారు.