Begin typing your search above and press return to search.

ఇవేం పన్నులు..సినిమాలు తీయాలా వద్దా.?

By:  Tupaki Desk   |   22 Jun 2018 4:04 PM IST
ఇవేం పన్నులు..సినిమాలు తీయాలా వద్దా.?
X
తమ్మారెడ్డి భరద్వాజ.. టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ దర్శక - నిర్మాత. ఏ విషయంపైన అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈయన తాజాగా సినిమా టికెట్ల ధరల విషయంలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ కారణంగా సినిమా రంగానికి రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు. మీడియా - ఎంటర్ టైన్ మెంట్ రంగంపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై తాజాగా అసోచాం - పీడబ్ల్యూసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తమ్మారెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘ప్రస్తుతం వంద రూపాయలు ఉన్న టికెట్ ధర త్వరలోనే రూ.150 కావడం ఖాయం. అదే సమయంలో రూ.150 ఉన్న టికెట్ ధర రూ.200 అవుతుంది. టికెట్ రేటు 100 రూపాయలు దాటితే జీఎస్టీ భారం పడుతుంది. జీఎస్టీ స్లాబ్ ప్రకారం 28శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ.150 టికెట్ మీద 42 రూపాయలు ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇంత పన్ను సినిమా పరిశ్రమపై మంచిది కాదు. దీనివల్ల సినిమాలు చూసేందుకు సామాన్యులు బయటకు రారు.. ఈ కారణంగా సినిమా హాళ్లు బోసిపోతాయి. సినిమా పరిశ్రమకు తీవ్ర దెబ్బ’ అని తమ్మారెడ్డి తేల్చిచెప్పారు.

జీఎస్టీ కారణంగా ఇప్పటికే నిర్మాతలకు 30 శాతం అదనపు పన్ను పడుతోందని.. టికెట్ రేటు పెరిగితే సామాన్యులపై భారీ భారం పడుతుందని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. అంతిమంగా ప్రేక్షకుడు థియేటర్లకు రావడం మానేస్తే మొత్తం సినిమా పరిశ్రమ మూసుకోవాల్సి వస్తుందని తెలిపారు. సినిమాను లగ్జరీ కింద నుంచి తీసేయాలని.. సినిమాల్లో వివిధ విభాగాల్లో వేల మంది పనిచేస్తుంటారని.. వారి భవిష్యత్ దృష్ట్యా జీఎస్టీ నుంచి సినిమా రంగాన్ని మినహాయించాలని తమ్మారెడ్డి ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు.