Begin typing your search above and press return to search.

చిరు.. పవన్ లు కత్తులు దూసుకోవాలా?

By:  Tupaki Desk   |   5 Jan 2017 4:10 PM GMT
చిరు.. పవన్ లు కత్తులు దూసుకోవాలా?
X
తెలుగు సినిమా రంగానికి సంబంధించి హాట్ టాపిక్స్ రెండున్నాయి. అందులో ఒకటి గుంటూరులో జరిగే చిరంజీవి ఖైదీ ప్రీరిలీజ్ కు పవన్ కల్యాణ్ వస్తారా? రారా? అన్నది ఒకటైతే.. సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే.. ఖైదీ.. గౌతమీలతో ఏ సినిమా సక్సెస్ అవుతుందన్నది మరొకటి. రెండు సినిమాల్లో ఏది హిట్ అన్న విషసయానికి మించి.. మెగా బ్రదర్స్ మధ్యన ఏదో దూరం ఉందని.. తమ్ముడ్ని ఏదో విధంగా తన ఫంక్షన్ కు తీసుకురావాలని అన్నయ్య ప్రయత్నిస్తున్నట్లు.. ఇందులో భాగంగా చిరు సతీమణి.. తన మరిదిని స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి.

అదే సమయంలో.. ఆయనేమైనా చిన్న పిల్లాడా? అంటూ రాంచరణ్ కాస్త పరుషంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఏమైనా.. అటు మీడియాలోనూ.. ఇటు వెబ్ సైట్లలోనూ.. సోషల్ మీడియాలోనూ అన్నదమ్ముల మధ్యన ఏదో కనిపించని వార్ నడుస్తున్నట్లుగా సమాచార బదిలీ సాగుతోంది.

ఇదిలా ఉన్న వేళ.. టాలీవుడ్ సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ పేరిట ఒక వీడియో క్లిప్పింగ్ ను విడుదల చేశారు. తొమ్మిది సెకండ్ల తక్కువ ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆయన కాస్తంత ఓపెన్ గానే కడిగేశారు. ఇద్దరు వ్యక్తులు భావజాలాలు వేరుగా ఉన్నంత మాత్రాన వారిద్దరి విడిపోవాలని.. కత్తులు దూసుకోవాలన్నట్లుగా శాడిజాన్ని పలువురు ప్రదర్శిస్తున్నారని.. ఇది తనకెంతో బాధ కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చిరంజీవి లేకపోతే పవన్ ఉన్నారా? అన్న మాటను కూడా అనేసిన తమ్మారెడ్డి.. చిరు.. పవన్ ల మధ్య అన్నదమ్ముల అనుబంధం భారీగా ఉండేదని చెప్పుకొచ్చారు. తన తమ్ముడి సినిమా ఖుషీ సూపర్ హిట్ అయి.. తన స్థాయికి చేరుకున్న తమ్ముడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవాడన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తమ్ముడి సినిమాల్లో ఫైటింగ్ బాగుండటంతో తన డాడీ సినిమాకు ప్రత్యేకంగా ఫైటింగ్ ఒకటి పవన్ నేతృత్వంలో చేయించుకున్నారని.. అలాంటి అనుబంధం వారి మధ్య ఉందని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో అన్నయ్య అంటే పవన్ కల్యాణ్ కు కూడా ఎంతో అభిమానమని.. అలాంటి వారిద్దరు రాజకీయాల విషయంలో.. ఇద్దరి భావజాలం విషయంలో కాస్తంత దూరం ఉన్నంత మాత్రానా.. వారిద్దరి మధ్యనే ఏదో ఉందంటూ సృష్టిస్తున్న వార్తలు సరికావని.. అవన్నీ చూస్తుంటే.. ఇద్దరిని కలపాలన్న ధ్యాస కంటే.. విడగొట్టాలన్న ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోందన్న మాటను ఓపెన్ గా చెప్పేశారు. ఈ సందర్భంగా మీడియాకు కాసిన్ని చురకలు వేసేశారు. వీలైతే కలుపుదాం.. అంతేకానీ.. విడగొట్టే పని మాత్రం చేయొద్దన్న తమ్మారెడ్డి మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/