Begin typing your search above and press return to search.

విజ‌య్ సినిమాకు రిలీజ్ క‌ష్టాలు

By:  Tupaki Desk   |   12 April 2016 8:04 AM GMT
విజ‌య్ సినిమాకు రిలీజ్ క‌ష్టాలు
X
కోలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ తాజా చిత్రం 'తెరి' కోసం ఆయ‌న అభిమానుల‌తో పాటు సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోంది. పులి లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో తెరి హిట్ అవ్వ‌డం విజ‌య్ కేరీర్‌కు చాలా ముఖ్యం. ఇక రాజా - రాణి సినిమా ద్వారా సౌత్ ఇండియాను ఎట్రాక్ట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ అట్లీకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో తెరిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే ఈ నెల 14న విడుదల కావలసిన ఈ సినిమా అనుకున్న టైంకు ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. రాదా అనే సందేహం ఇప్పుడు అందరిలోను నెల‌కొంది. తెరికి దాదాపు రూ.100 కోట్ల వ‌ర‌కు మార్కెట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ - మ‌ల్లూవుడ్‌ లో కూడా తెరి భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు ఈ సినిమాను పోలీసోడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు.

భారీ రేట్ల‌కు తెరిని కొన్న బ‌య్య‌ర్లు - థియేట‌ర్ ఓనర్లు టిక్కెట్ రేట్లు పెంచి అమ్మాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే తెరికి థియేట‌ర్ ఓన‌ర్లు టికెట్ల రేట్లు పెంచి అమ్మడానికి వీల్లేదనీ, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు ఇలా ఉంటే టిక్కెట్ల రేట్లు పెంచి అమ్మ‌క‌పోతే త‌మ‌కు పెట్టుబ‌డి కూడా రాద‌ని థియేట‌ర్ల ఓన‌ర్లు అంటున్నారు. ప్ర‌భుత్వం మాత్రం టిక్కెట్ల రేట్లు పెంచితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో అసలు సినిమానే ప్రదర్శించకుండా ఉండటం బెటరనే నిర్ణయానికి థియేట‌ర్ల ఓన‌ర్లు వ‌చ్చారు.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తెరి సినిమా హ‌క్కులు కొన్న వారు తాము తెరిని ప్ర‌ద‌ర్శించ‌డం లేదంటూ బ‌య‌ట పోస్ట‌ర్లు కూడా అంటించారు. దీంతో విజ‌య్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇక విజ‌య్ సినిమా అంటేనే ప్ర‌తి సారి ఏదో ఒక వివాదం రావ‌డం కామ‌న్ అయిపోయింది.