Begin typing your search above and press return to search.

ఇక త‌మిళ‌నాట డ‌బ్బింగ్ సినిమాల‌కి ట్యాక్స్ లేదు

By:  Tupaki Desk   |   30 Sep 2015 3:58 PM GMT
ఇక త‌మిళ‌నాట డ‌బ్బింగ్ సినిమాల‌కి ట్యాక్స్ లేదు
X
తెలుగు నిర్మాత‌ల‌కి ఓ శుభ‌వార్త‌. త‌మిళ‌నాట సినిమాల్ని విడుద‌ల చేసుకొంటే ఇదివ‌ర‌క‌టిలా ట్యాక్స్ క‌ట్ట‌క్క‌ర్లేదు. ఇక నుంచి త‌మిళ సినిమాలు ఎంత ట్యాక్స్ చెల్లిస్తాయో, అక్క‌డికి డ‌బ్బింగ్ రూపంలో వెళ్లే మ‌న సినిమాలు కూడా అంతే ట్యాక్స్ చెల్లిస్తాయి. త‌మిళ‌నాడు హైకోర్టు ఆ విష‌యం గురించి ఉత్త‌ర్వులు వెలువ‌రించిన‌ట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ‌నాడులో త‌మిళ్ పేరుతో రూపొందే సినిమాల‌న్నింటికీ 30 శాతం ట్యాక్స్ మిన‌హాయింపు ఇస్తోంది ఆ ప్ర‌భుత్వం. అందుకే దాదాపు సినిమాలు ప‌క్కా త‌మిళ్ పేర్ల‌తోనే తెర‌కెక్కుతుంటాయి. ఆ ఆఫ‌ర్‌ ని త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ బాగా స‌ద్వినియోగం చేసుకుంటూ వ‌స్తోంది. అయితే అక్క‌డ విడుద‌ల‌య్యే డ‌బ్బింగ్ సినిమాల‌కి మాత్రం ట్యాక్స్ మిన‌హాయింపు ద‌క్కేది కాదు.

త‌మిళంలో పేర్లు పెడ‌తామ‌న్నా ఆ ప్ర‌భుత్వం ట్యాక్స్ క‌ట్టాల్సిందే అని ఓ నిబంధన విధించింది. దీంతో అక్క‌డ డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌ల చేసుకొనే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు - ప్రొడ్యూస‌ర్ల‌కి పెద్ద‌గా లాభాలు ద‌క్కేవి కావు. సినిమా ఎంత ఘ‌న విజ‌యం సాధించినా అంతంత మాత్రంగానే లాభం వ‌చ్చేది. దీనిపై ఇటీవ‌ల కొంత‌మంది కోర్టుకెక్కారు. కోర్టు పూర్వ‌ప‌రాల‌న్నీ తెలుసుకొని ఇక నుంచి త‌మిళ‌నాట డ‌బ్బింగ్ సినిమాల‌కి కూడా ట్యాక్స్ మిన‌హాయింపును ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి ఎంతో ఆనందం క‌లిగిస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల తెలుగు సినిమాలు త‌మిళంలో విరివిగా డ‌బ్ అవుతున్నాయి. మ‌న స్టార్లంద‌రూ కూడా త‌మిళంలోనూ మార్కెట్ సంపాదించుకోవాల‌నుకొంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ట్యాక్స్ మిన‌హాయింపు ద‌క్క‌డమంటే మ‌న‌కు చాలా మంచి జ‌రిగిన‌ట్టే. అయితే ఈ మేలు ఒక్క తెలుగు సినిమాల‌కే కాదు... ఇంగ్లీష్ సినిమాల్ని డ‌బ్ చేసుకొనేవాళ్ల‌కి కూడా మ‌రింత మేలు చేకూరిన‌ట్ట‌వుతుంది. ఇక నుంచి త‌మిళ‌నాడు డ‌బ్బింగ్ సినిమాల‌తో హోరెత్తే అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా ప్ర‌తీ తెలుగు సినిమా అక్క‌డ డ‌బ్ అవ్వొచ్చు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో యేటా 80కిపైగా డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయ‌ట‌.