Begin typing your search above and press return to search.

త‌మిళ సూప‌ర్ స్టార్స్ కి వైజాగ్ అంటే పిచ్చి

By:  Tupaki Desk   |   17 Aug 2022 6:30 AM GMT
త‌మిళ సూప‌ర్ స్టార్స్ కి వైజాగ్ అంటే పిచ్చి
X
తమిళ స్టార్ హీరో ద‌ళ‌పతి విజయ్ న‌టిస్తున్న వార‌సుడు (వరిసు త‌మిళ్‌) చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో బీచ్ సొగ‌సుల సుంద‌ర నగరం విశాఖపట్నంలో చిత్రీకర‌ణ ప్రారంభించారు.

ఇంత‌లోనే మరో త‌మిళ స్టార్ హీరో త‌ళా అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని వైజాగ్ లో ప్రారంభించాడు. 'వాలిమై' ఫేం హెచ్.వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌ళా అజిత్ తో అత‌డికి మూడో అవకాశ‌మిది. ఈ చిత్రానికి తాత్కాలికంగా AK61 అని పేరు పెట్టారు. ఇందులో త‌ళా స‌ర‌స‌న‌ మంజు వారియర్ కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ అని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.అలాగే గత నెలలో పూణెలో ఓ షెడ్యూల్ చేసారు. ఇందులో అజయ్- సముద్రఖని -వీర జాన్ కొక్కన్ ఇతర కీల‌క‌ పాత్రల్లో న‌టిస్తున్నారు.

80శాతం షూటింగులు ఇక్క‌డే టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌స‌న్న‌కుమార్ ప్ర‌కారం.. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో షూటింగులు చేసేందుకు తెలుగు -త‌మిళ స్టార్లు నిరంత‌రం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు.

టాలీవుడ్ కి చెందిన దాదాపు 80శాతం షూటింగుల‌కు వైజాగ్ - అర‌కు బెల్ట్ ఎంతో స‌హ‌క‌రిస్తుంద‌ని కూడా తెలిపారు. ఒడియా- క‌న్న‌డ‌- మ‌ల‌యాళ‌ సినిమాలు కూడా ఇక్క‌డ ఎక్కువ‌గా తెర‌కెక్కుతుంటాయని అన్నారు.

ఎన్టీఆర్ - ఏఎన్నార్ స‌హా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహా బాల‌కృష్ణ‌- విక్ట‌రీ వెంక‌టేష్- అక్కినేని నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోలు విశాఖ న‌గ‌రంలో షూటింగుల‌పై ఆస‌క్తిగా ఉంటారు. 70ల కాలం నుండి విశాఖ అర‌కు లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ‌ల‌పై టాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.. అని ఆయ‌న వెల్ల‌డించారు.