Begin typing your search above and press return to search.

తమిళ సినిమాలకు దిక్కు తోచట్లేదు

By:  Tupaki Desk   |   3 July 2017 4:25 AM GMT
తమిళ సినిమాలకు దిక్కు తోచట్లేదు
X
తమిళ సినీ పరిశ్రమ ఇప్పుడు పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. జీఎస్టీ పుణ్యమా అని కొత్త సినిమాలే రిలీజవ్వని పరిస్థితి నెలకొంది. జీఎస్టీకి వ్యతిరేకంగా థియేటర్లు మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ.. దాన్ని ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. గత శుక్రవారం గౌతమ్ కార్తీక్ హీరోగా ఓ కొత్త సినిమాను రిలీజ్ చేయగా.. థియేటర్ల యాజమాన్యాల స్ట్రైక్ కారణంగా ఆ సినిమా అన్యాయమైపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. థియేటర్లు మూతపడి కలెక్షన్లకు కోత పడిపోయింది. మళ్లీ థియేటర్లు తెరుచుకునే సమయానికి ఆ సినిమా ఉంటుందో లేదో తెలియదు. మరోవైపు చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు జూన్ 30న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సెల్వ రాఘవన్ సినిమా ‘నెంజమ్ మరప్పదిల్లై’కు బ్రేక్ పడిపోయింది. జీఎస్టీ కారణంగా అయోమయ పరిస్థితి నెలకొనడంతో ఆ సినిమా రిలీజ్ ఆపేశారు.

కేంద్రం జీఎస్టీ పేరుతో విధించే పన్నుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా వినోదపు పన్ను వసూలు చేయాలని నిర్ణయించడం తమిళ నిర్మాతల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. మొన్నటిదాకా తమిళ నిర్మాతలు వినోదపు పన్ను కింద పైసా చెల్లించట్లేదు. తమిళంలో టైటిల్ పెట్టి.. క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమాలకు పన్ను రద్దు చేసే ఆనవాయితీ ఉండటంతో దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు జీఎస్టీ కింద 18 శాతం పన్ను.. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కలుస్తుండటంతో వారికి భారీగా నష్టం తప్పేలా లేదు. దీనిపై ఓవైపు నిర్మాతలు.. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు కరిగే పరిస్థితి కనిపించట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/