Begin typing your search above and press return to search.

కోలీవుడ్ ఉలిక్కిపడేలా థియేటర్ యజమానుల సంఘం వార్నింగ్..

By:  Tupaki Desk   |   25 Dec 2019 10:52 AM IST
కోలీవుడ్ ఉలిక్కిపడేలా థియేటర్ యజమానుల సంఘం వార్నింగ్..
X
సంచలన డిమాండ్ ను తెర మీదకు తీసుకురావటమే కాదు.. దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చారు తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం. తాజాగా వారు పలు అంశాల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను బంద్ చేస్తామని హెచ్చరించింది. ఇంతకీ వారి డిమాండ్లను చూస్తే.. అంత ఈజీ ఏమీ కాదు.

ఎందుకంటే.. రాష్ట్రప్రభుత్వం వసూలు చేస్తున్న 8శాతం వినోద పన్నును రద్దు చేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. పెద్ద చిత్రాల ద్వారా నష్టపోతే ఆ నష్టాన్ని చిత్ర నటీనటులే భరించాలని చెబుతున్నారు. అంతేకాదు.. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలను వంద రోజుల వరకూ డిజిటల్ విభాగాల్లో విడుదల చేయకూడదన్న డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.

ఒకవేళ తమ డిమాండ్లను పట్టించుకోకుండా ఆ గడువు లోపు సినిమాలను డిజిటల్ విభాగంలో విడుదల చేస్తే..సదరు నిర్మాత సినిమాలను రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తమ డిమాండ్లను సీరియస్ గా తీసుకోకుండా ఉంటే.. మార్చి ఒకటి నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా చాలా క్లిష్టమైన డిమాండ్లను తెర మీదకు తెచ్చిన ఈ డిమాండ్లపై కోలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ప్రశ్న. ఇవే డిమాండ్లను తెలుగు నేల మీద ఉన్న థియేటర్ల యజమానుల సంఘం కూడా తీసుకొస్తే టాలీవుడ్ కు కొత్త సమస్య మీద పడినట్లే.