Begin typing your search above and press return to search.

తెలుగు నేలపై దండ‌యాత్ర స్టార్ట్ చేస్తున్న త‌మిళ హీరోలు..!

By:  Tupaki Desk   |   25 July 2021 7:00 AM IST
తెలుగు నేలపై దండ‌యాత్ర స్టార్ట్ చేస్తున్న త‌మిళ హీరోలు..!
X
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు కేవలం ఒక భాషకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే తమిళ్ హీరోలు మాత్రం ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది.

సీనియర్ హీరోలైన రజినీకాంత్ - కమల్ హాసన్ వంటి హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేసి వదలడమో.. లేదంటే తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయడమో చేస్తుండేవారు. ఆ తర్వాతి తరం హీరోలైన విక్రమ్ - సూర్య - విజయ్ - విశాల్ - ధనుష్ - కార్తీ - ఆర్య వంటి హీరోలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

తెలుగు సినిమాలతో సమానంగా తమిళ హీరోల సినిమాలకి కూడా ఇక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్తీ ఇప్పటికే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు మిగతా హీరోలు కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి టాలీవుడ్ దర్శక నిర్మాతల సహాయం తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఐదుగురు టాలీవుడ్ ద‌ర్శ‌కులు న‌లుగురు త‌మిళ స్టార్ హీరోల‌తో సినిమాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2023 లోపు ఈ ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ కి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై ఈ మూవీ రూపొందనుంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు నిర్మాతలు.

అలానే ధనుష్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ సినిమా చేయనున్నారని టాక్ నడుస్తోంది. 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఇన్నాళ్లూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్.. ఈసారి స్ట్రెయిట్ సినిమాతో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారని అర్థం అవుతోంది.

తమిళ హీరో విజయ్ నటించిన సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'మాస్టర్' ఇక్కడ కూడా మంచి వసూళ్ళు రాబట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ పాన్ సౌత్ ఇండియా మూవీ చేయడానికి విజయ్ రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. #Thalapathy66 సినిమా వీళ్ళ కాంబోలోనే ఉంటుందని దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎప్పటి నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దిల్ రాజు అప్పట్లో సూర్య తో ఓ బైలింగ్విల్ ప్లాన్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. ఇంతవరకు దీనికి సంబంధించిన స్పష్టత రానప్పటికి.. మళ్లీ ఇప్పుడు సూర్య తెలుగు ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా దిల్ రాజు ఓ మల్టీలాంగ్వేజ్ ఫిలిం ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

ఇదే క్రమంలో తెలుగులో పెద్దగా మార్కెట్ లేని తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడని తెలుస్తోంది. దీని కోసం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారని టాక్. అలానే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఓ తమిళ స్టార్ హీరోతో ఓ ద్విభాషా చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇలా తమిళ హీరోలందరూ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పై దృష్టి పెట్టి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే మన హీరోలు కోలీవుడ్ దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమిళ మార్కెట్ పై కన్నేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తుండగా.. లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ పోతినేని ఓ బైలింగ్విల్ లో నటిస్తున్నాడు. అలానే అల్లు అర్జున్ - మురగదాస్ కాంబోలో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది. లోకేష్ కనగరాజ్ - సుధా కొంగర వంటి డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నారు.