Begin typing your search above and press return to search.

రివ్యూలను నియంత్రిస్తే చెత్త సినిమా కూడా హిట్ అవుద్దా..?

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:41 AM GMT
రివ్యూలను నియంత్రిస్తే చెత్త సినిమా కూడా హిట్ అవుద్దా..?
X
'రివ్యూ'ల మీద సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చలు జరుగుతుంటాయి. ప్రేక్షకులు సమీక్షలు కావాలని కోరుకుంటుంటే.. ఇండస్ట్రీ జనాల్లో మాత్రం వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. విడుదలైన రోజే రివ్యూలు వస్తే.. వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుందని కొందరు వాదిస్తుంటారు. మరికొందరు మాత్రం సమీక్షలను సమర్థిస్తుంటారు.

రివ్యూలు పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ.. అదే నెగెటివ్ రివ్యూలు వస్తే మాత్రం కొందరు గగ్గోలు పెడుతున్నారు. వీటి కారణంగానే జనాలు థియేటర్లకు రావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి సినిమా రిలీజైన మూడు లేదా నాలుగు రోజుల తరువాత రివ్యూలు పోస్ట్ చేయాలంటూ సలహాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రివ్యూలను నియంత్రించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత మాత్రమే రివ్యూలు బయటకు వచ్చేలా ఒక రూల్‌ ని పాస్ చేయాలని అభ్యర్థించింది.

అంతేకాదు సినిమా రివ్యూలు చేయడానికి యూట్యూబ్ ఛానెల్స్ ను ప్రీమియర్స్ కు అనుమతించవద్దని వారు థియేటర్ యజమానులను అభ్యర్థిస్తున్నారు. అయితే TFPC డిమాండ్లు అశాస్త్రీయమైనవిగా అసాధ్యమైనవిగా పేర్కొంటున్నారు.

డిజిటల్ యుగంలో రివ్యూలు వ్యాప్తి చెందకుండా ఆపడం అసాధ్యమని చెప్పాలి. అలాంటి నిబంధనలను ప్రతిపాదించి వారు ప్రజల గొంతును లేదా అభిప్రాయాలను నియంత్రించలేరని గ్రహించాలి.

సినిమా లేదా ఏదైనా ప్రోడక్ట్ విషయంలో రివ్యూలది ఎప్పుడూ కీలక పాత్ర అని చెప్పాలి. ఒక వస్తువు కొనుగోలు చేసేముందు రివ్యూలు చూస్తాం.. అలానే సినిమా చూడాలంటే రేటింగ్స్ చూస్తాం. అది రెండింటికీ ఒకేలా వర్తిస్తుంది.

ప్రోడక్ట్ కు రేటింగ్స్ చూపించకపోవడం.. సినిమా రివ్యూలను ఆలస్యం చేయడం వంటి చర్యలు.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించడమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి సినిమా బాగుందని తేలితే ఈ రివ్యూలు పాజిటివ్ మౌత్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి సహాయపడతాయి.. మరింత మంది అభిమానులను ఆకర్షిస్తాయి. తద్వారా నిర్మాతలు మునుపటి కంటే త్వరగా బ్రేక్‌ ఈవెన్‌ కి చేరుకోవడం సులభం అవుతుంది.

మంచి సినిమాలను కంటెంట్ ఉన్న చిత్రాలను ఎవరూ ఆపలేరనేది మేకర్స్ తెలుసుకుంటే మంచిది. రివ్యూలను నియంత్రించడానికి కాకుండా.. మంచి కంటెంట్ ను ఉత్తేజకరమైన సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది.

అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో.. రివ్యూలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాను ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటే కచ్చితంగా రివ్యూలు చూసే డిసైడ్ అవుతానని తెలిపారు. కనీసం వెయ్యి రివ్యూలు - 7 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమాలు లేదా సిరీస్ ని మాత్రమే చూడడానికి ఇష్టపడుతున్నానని అన్నారు.

ఒకప్పుడు సినిమా రివ్యూలు వారం తరువాత పేపర్లు - మ్యాగజైన్స్ లో వచ్చేవని.. అప్పటికి సినిమా ఉందో, లేదో కూడా చాలా మందికి తెలిసేది కాదని నాగ్ అన్నారు. అందుకే అప్పుడు రివ్యూలను పెద్దగా పట్టించుకునేవారు కాదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. సోషల్ మీడియా - వెబ్ సైట్స్ పెరిగిన తరువాత రివ్యూలకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు.

సినిమా టాక్ లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కింగ్ అభిప్రాయపడ్డారు. సో కంటెంటే కింగ్ అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కాబట్టి.. మేకర్స్ ఇలాంటి జిమ్మిక్కులకు బదులు మంచి సినిమా తీయడానికి తమ వనరులన్నింటినీ వెచ్చించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే రివ్యూలే దాన్ని మరింత మందికి చేరవేస్తాయని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.