Begin typing your search above and press return to search.

నిజ‌మైన నివాళిః న‌టుడు వివేక్ అస్థికల‌ను ఏం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   28 April 2021 6:35 AM GMT
నిజ‌మైన నివాళిః న‌టుడు వివేక్ అస్థికల‌ను ఏం చేశారో తెలుసా?
X
ఉన్నాయో.. లేవో తెలియ‌ని లోకాల‌ను త‌లుచుకుంటూ బ‌తికి.. చ‌నిపోయిన త‌ర్వాత కూడా వాటిలో స్థానం కోసం వెంప‌ర్లాడే మ‌నుషులు కొంద‌రు. ఉన్నంత కాలం క‌ళ్ల ముందు కనిపించే ప్ర‌కృతి కోసం, మ‌నుషుల కోసం బ‌తికి.. చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఉప‌యోగ‌ప‌డే మ‌హోన్న‌తులు మ‌రికొంద‌రు! నిస్సందేహంగా ఈ రెండో కోవ‌కు చెందుతారు ప్ర‌ముఖ త‌మిళ హాస్య‌న‌టుడు వివేక్‌.

ఇటీవ‌ల ఆయ‌న గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఊహించ‌ని ఈ వార్త‌తో త‌మిళ‌నాడుతోపాటు ద‌క్షిణాది మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. బంధువులు, అభిమానుల అశృన‌య‌నాల న‌డుమ వివేక్ ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు. అయితే.. దైవాన్ని న‌మ్మేవారు త‌మ అస్థిక‌ల‌ను ఏ గంగ‌లోనో.. మ‌రో పుణ్య‌క్షేత్రంలోనే క‌ల‌పాల‌ని కోరుకుంటారు. కుటుంబ స‌భ్యులు కూడా అదే చేస్తారు.

అయితే.. వివేక్ కుటుంబం చేసిన ప‌ని చూసి అంద‌రికీ క‌ళ్ల‌నీళ్లు ఆగ‌లేదు. వివేక్ అస్థిక‌ల‌ను ఆయ‌న స్వ‌గ్రామం పెరుంగ‌టూర్ కు తీసుకెళ్లారు. ప్ర‌కృతి ప్రేమికుడైన వివేక్ కు నివాళిగా.. ఆ గ్రామ శ్మశానంలో మొక్క‌లు నాటారు. ఆ మొక్క‌ల‌కు ఎరువుగా ఆయ‌న ఆస్థిక‌ల‌ను చ‌ల్లారు.

ఇది చూసిన వారు, సోష‌ల్ మీడియా ద్వారా తెలుసుకున్న వారి హృద‌యం బ‌రువెక్కింది. బ‌తికినంత కాలం మొక్క‌ల కోసం శ్ర‌మించిన వివేక్‌.. చ‌నిపోయిన త‌ర్వాత కూడా వాటికి ఎరువులా మారార‌ని ఎమోష‌నల్‌ అయ్యారు.

వివేక్ ప్ర‌కృతిని ఎంత‌గానో ప్రేమించేవాడు. అబ్దుల్ క‌లామ్ ను త‌న గురువుగా చెప్పిన ఆయ‌న‌.. కలాం కోరిక మేర‌కు గ్లోబ‌ల్ వార్మింగ్ నివార‌ణ‌లో భాగంగా.. చెట్ల పెంప‌కాన్నే త‌న జీవిత మిష‌న్ గా తీసుకున్నారు. త‌న జీవిత కాలంలో కోటి మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 33 ల‌క్ష‌ల మొక్క‌లు నాటారు. ఆయ‌న ల‌క్ష్యాన్ని తాము పూర్తిచేస్తామంటూ అభిమానులు ముందుకు వ‌స్తున్నారు.