Begin typing your search above and press return to search.

మరోసారి 'మాస్టర్‌' వస్తాడట!

By:  Tupaki Desk   |   23 May 2022 1:30 AM GMT
మరోసారి మాస్టర్‌ వస్తాడట!
X
తమిళంతో పాటు ప్రస్తుతం సౌత్‌ మొత్తం కూడా వినిపిస్తున్న దర్శకుడి పేరు లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమా తో తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కగనరాజ్ ప్రస్తుతం 'విక్రమ్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కమల్‌ హాసన్ హీరోగా ఫహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ సినిమా జూన్‌ 3వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు రాబోతున్నాయి. విక్రమ్‌ తర్వాత వెంటనే ఖైదీ సీక్వెల్‌ ను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ తర్వాత సినిమా విషయంలో కూడా లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్‌ విజయ్ తో మాస్టర్ సినిమాను చేసిన లోకేష్ కనగరాజ్ మరో సినిమాను కూడా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

ఇటీవలే అజిత్ తో లోకేష్ కనగరాజ్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరో వైపు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో కూడా లోకేష్‌ కనగరాజ్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. తెలుగు లో కూడా ఆయన సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇన్ని సినిమాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో తన తదుపరి సినిమాల విషయంలో లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇవ్వడంతో ఒక గందరగోళం తేలిపోతున్నట్లు అయ్యింది.

విజయ్ ప్రస్తుతం తెలుగు లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. షూటింగ్‌ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. విజయ్‌ తదుపరి సినిమా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కాని విక్రమ్‌ ప్రమోషనల్‌ ఈవెంట్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమాను విజయ్‌ తో చేస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరో మాస్టర్‌ వస్తాడేమో చూడాలి.