Begin typing your search above and press return to search.

బాహుబలి.. మంట పుడుతోంది కానీ..

By:  Tupaki Desk   |   12 July 2015 9:15 AM IST
బాహుబలి.. మంట పుడుతోంది కానీ..
X
హిందీ సినిమాలు తీసేవాళ్లు, చూసేవాళ్లు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే అనుకుంటారు. అలాగే తమిళ ఆడియన్స్‌, మేకర్స్‌ సౌత్‌ ఇండియన్‌ సినిమా అంటే కోలీవుడ్‌ మాత్రమే అని ఫిక్స్‌ అయిపోతారు. వాళ్ల సినిమాలు బాగుంటాయనడంలో ఎవరికీ సందేహాల్లేవు. జాతీయ అవార్డుల్లో తరచుగా తమిళ సినిమాల హవా సాగుతుంటుందన్నది వాస్తవం. అంతర్జాతీయ స్థాయిలోనూ వాళ్ల సినిమాలకు మంచి గుర్తింపుందన్నదీ వాస్తవం. కానీ వాళ్ల సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం గురించి ఎవరికీ అభ్యంతరాల్లేవు కానీ.. మన తెలుగు సినిమా అంటే వారికి ఒకరకమైన చిన్నచూపు. మన సినిమాలు అక్కడ అనువాదం కావడమే అరుదు కానీ.. అయిన వాటి గురించి కూడా తమాషా చేస్తుంటారు. మగధీర లాంటి సినిమాలో కూడా విషయం లేదని అక్కడి రివ్యూయర్లు తేల్చేశారు. మిగతా తెలుగు అనువాదాల్ని కూడా తక్కువగానే చూశారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కలేదు.

ఐతే రాజమౌళి 'ఈగ' మాత్రం అరవోళ్ల నోళ్లు మూయించింది. వీడు మామూలోడు కాదు అనిపించింది. ఆ సినిమాతో కోలీవుడ్‌పై తనదైన ముద్ర వేసిన రాజమౌళి.. ఇప్పుడు 'బాహుబలి'తో అక్కడ ప్రకంపనలే సృష్టిస్తున్నాడు. డైరెక్ట్‌ తమిళ సినిమాలకు దీటుగా అక్కడ బాహుబలి సాగిస్తున్న హవా చూస్తుంటే తమిళ క్రిటిక్స్‌కు, ఇండస్ట్రీ జనాలకు దిమ్మదిరిగిపోతోంది. రిలీజ్‌కు ముందు బుకింగ్స్‌ ఓ మాదిరిగా ఉన్నాయి కానీ.. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ, ప్రతి క్రిటిక్కూ సినిమా సూపర్‌ అంటుంటే.. శుక్రవారం నుంచి పరిస్థితి మారిపోయింది. ఆదివారం వరకు టికెట్లన్నీ స్మాష్‌. డిమాండ్‌ విపరీతంగా ఉండటంతో కొన్ని చోట్ల తమిళ సినిమాల్ని తీసేసి.. బాహుబలి షోలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉండటమేంటని చాలామందికి దిమ్మదిరిగిపోతోంది. ఇండియాలో ఇలాంటి భారీ సినిమాలు తీయాలంటే మా శంకర్‌కే సాధ్యం అని చెప్పుకునే తమిళ జనాలు.. ఇప్పుడు శంకర్‌ కూడా అందుకోలేనంత హైట్స్‌కు రాజమౌళి వెళ్లిపోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూసి కొంచెం మంట పుడుతున్నా బాహుబలిని అవాయిడ్‌ చేయలేని పరిస్థితి. అక్కడ కూడా చూసిన జనాలే మళ్లీ మళ్లీ బాహుబలి కోసం ఎగబడుతుండటం విశేషం.