Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో తమన్నా కొత్త నిర్ణయం!

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:00 PM IST
కొత్త ఏడాదిలో తమన్నా కొత్త నిర్ణయం!
X
తమన్నా అంటే సుకుమారం .. తమన్నా అంటే సౌందర్యం .. తమన్నా అంటే సోయగాల సరాగం. తమలపాకులా .. తెల్ల తామరలా తెరపై కనిపించిన తమన్నాను చూసి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులను పారేసుకున్నారు. ఆ రోజు నుంచి తేనె టీగల్లా ఆమెను ఫాలో అవుతూనే ఉన్నారు. తమ మనసులను సాగరాలుగా మార్చేసుకుని, ఆమెను సాగరకన్యగా ఊహించేసుకున్నారు. అలా గులాబీకే గుండెపోటు తెప్పించే మేని ఛాయతో .. అందుకు తగిన అభినయంతో తెలుగు తెరకి 'శ్రీ' సినిమాతో తమన్నా పరిచయమైంది. ఈ 15 ఏళ్లలో ఆమె తారాజువ్వలా దూసుకుపోయింది. స్టార్ హీరోలతో వరుస అవకాశాలను అందుకుంటూ, భారీ విజయాలను తన ఖాతాలో జమచేసుకుంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తిరుగులేని గ్లామర్ కి చిరునామాగా మారిపోయింది.

తమన్నా తన కెరియర్ ను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. ఒక వైపున కుర్ర హీరోలతోనూ .. మరో వైపున సీనియర్ హీరోలతోను కలిసి ఆడిపాడింది. అంతేకాదు తెలుగులో అవకాశాలు తగ్గితే మారో మార్గం ఉండాలనే ఉద్దేశంతో, ముందుగానే తమిళ .. హిందీ భాషల్లో 'కర్చీఫ్' లు వేసేసింది. బాలీవుడ్ ప్రేక్షకులను అడపా దడపా పలకరిస్తూనే, తమిళంలో తన జోరును కొనసాగిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విజయభేరి మ్రోగించిన 'బాహుబలి' సినిమాలోను, సంచలన విజయానికి సాక్ష్యంగా నిలిచిన 'సైరా' సినిమాలోను తమన్నా అవకాశాన్ని పొందడం, గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమె ప్రతిభకి జరిగిన పట్టాభిషేకంగానే చెప్పుకోవాలి.

తమన్నా తన ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంతకాలమైనా, ఆమె గ్లామర్ చెక్కుచెదరలేదు. ఆ మధ్య వచ్చిన 'ఎఫ్ 2' సినిమాలోని ఒక పాటలో ఆమె చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. గ్లామరస్ హీరోయిన్ గా తమన్నాకి మరికొన్నాళ్లు ఢోకా లేదనే టాక్ బలంగా వినిపించింది. కానీ కొత్త సంవత్సరంలో తమన్నా తన రూటు మార్చనున్నట్టు తెలుస్తోంది. ఇంకా గ్లామర్ పాత్రలనే చేస్తూ ఆటపాటల వరకే పరిమితం కాకుండా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేయాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఒక దశవరకూ గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చిన అనుష్క .. నయనతార, ఆ తరువాత నటనకి ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ వెళ్లారు. అలాగే నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ, హీరోలతో సమానమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 'త్రిష' కూడా అదే దిశగా అడుగులు వేసింది. కెరియర్ పరంగా త్రిష పని అయిపోయిందని అంతా అనుకుంటున్న పరిస్థితుల్లో, నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలే ఆమెను ఆదుకున్నాయి. తిరిగి ఇప్పుడామె తమిళంలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు అదే బాటలో ప్రయాణించాలనే నిర్ణయానికి తమన్నా వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న పాత్రలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే ఏడాది నుంచే తమన్నా తన ఆలోచనను ఆచరణలో పెట్టనుంది. మున్ముందు తమన్నా ఎన్ని సాహసాలు చేస్తుందో .. మరెన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతుందో చూడాలి.