Begin typing your search above and press return to search.

సమంత ముందు తేలిపోయిన తమన్నా..!

By:  Tupaki Desk   |   10 April 2022 1:30 AM GMT
సమంత ముందు తేలిపోయిన తమన్నా..!
X
కమర్షియల్ సినిమాల్లో 'ఐటమ్' సాంగ్స్ అనేవి కామన్. సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే ఈ ప్రత్యేక గీతాలకు ఓ వర్గం అభిమానులు ఎప్పుడూ ఉంటారు. ఐటమ్ సాంగ్ తోనే జనాలను థియేటర్లకు రప్పించిన సినిమాలు ఉన్నాయి. అందుకే వీటి కోసం మేకర్స్ ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంటారు.

ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ భామలుగా మారుతున్నారు. బాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ ఐటెం సాంగ్ లో ఆడిపాడటం అనేది ఎప్పుడో మొదలైంది.

ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ కూడా ప్రత్యేక గీతాల్లో నర్తించడానికి వెనుకాడటం లేదు. దీనికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో స్పెషల్ నంబర్స్ చేసేందుకు మొహమాట పడటం లేదు. అలాంటి పాటల్లో ఎక్కువగా నర్తించిన హీరోయిన్ తమన్నా భాటియా అని చెప్పవచ్చు.

అందం అభినయం గ్లామర్ కలబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. డ్యాన్సులు కూడా ఇరగదీస్తుంది. అందుకే స్పెషల్ సాంగ్స్ కోసం మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఇప్పటికే అనేక సినిమాల్లో ఐటమ్ భామగా కనిపించిన అమ్మడు.. ఇప్పుడు 'గని' సినిమాతో పలకరించింది.

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన బాక్సింగ్ డ్రామా 'గని' శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఇందులో తమన్నా 'కొడితే' అనే స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొరియోగ్రఫీ బాగాలేదని.. సినిమాకు ఏమాత్రం ప్లస్ అవదననే కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి 'కొడితే' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడడే.. అనుకున్న స్దాయిలో జనాల్లోకి వెళ్లలేదు. అప్పటికే 'పుష్ప' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన 'ఊ అంటావా మామా.. ఊఊ అంటావా' పాట ఊపేస్తుండటంతో కంపేరిజన్స్ మొదలయ్యాయి.

సమంత తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ 'పుష్ప' సినిమా విజయానికి సహాయ పడింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి భారీ హైప్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు తమన్నా ఐటమ్ సాంగ్ తేలిపోయింది. సినిమాకు జనాలను రప్పించడానికి ఈ పాట ఏమాత్రం ఉపయోగపడదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.