Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : టక్కర్

By:  Tupaki Desk   |   9 Jun 2023 2:27 PM GMT
మూవీ రివ్యూ : టక్కర్
X
మూవీ రివ్యూ : 'టక్కర్'

నటీనటులు: సిద్దార్థ్-దివ్యాంశ కౌశిక్-అభిమన్యు సింగ్యోగిబాబు-మునీష్ కాంత్-విఘ్నేష్ కాంత్
సంగీతం: నివాస్ ప్రసన్న
ఛాయాగ్రహణం: వాంజినాథన్ మురుగేశన్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్-సుధన్ సుందరం-జయరాం
రచన: శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి.కృష్ణ
దర్శకత్వం: కార్తీక్ జి.కృష్ణ

ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ నటుడు సిద్దార్థ్.. తర్వాత వరుస ఫ్లాపులతో మార్కెట్ కోల్పోయాడు. ఈ మధ్య ‘మహాసముద్రం’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు అతను తమిళంలో నటించిన ‘టక్కర్’ సినిమా తెలుగులోకి అనువాదమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గుణశేఖర్ (సిద్దార్థ్) ఒక పేదింట్లో పుట్టిన కుర్రాడు. డబ్బు లేకపోవడం వల్ల తను గడుపుతున్న దుర్భర జీవితం పట్ల ఎప్పుడూ అతను మథనపడుతుంటాడు. డబ్బు సంపాదించడం కోసం రకరకాల పనులు చేసిన అతను.. తన కోపం వల్ల ఎక్కడా కుదురుకోలేకపోతాడు. చివరికి ఒక బెంజ్ కారును అద్దెకు తీసుకుని ట్యాక్సీ నడుపుతుంటాడు. ఓ ప్రమాదంలో ఆ కారు ధ్వంసమై యజమాని చేతిలో చావు దెబ్బలు తినడం.. అదే సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు గుణ. కానీ అతడికి ధైర్యం సరిపోదు. తన చావు కోసం మార్గం వెతుక్కుంటున్న సమయంలో తనను గతంలో మోసం చేసిన ఒక రౌడీ ఎదురు పడటంతో అతణ్ని చావగొట్టి అతడి కారు తీసుకుని పారిపోతాడు గుణ. ఆ కారు డిక్కీలో కిడ్నాప్ అయిన ఓ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వల్ల గుణ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరు.. ఈ కిడ్నాప్ డ్రామాకు ముగింపు ఏంటి.. చివరికి గుణ జీవితం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

చేతిలో బాగా డబ్బులుండి.. మన ఆలోచనలకు తగ్గ స్నేహితులు ఉండి.. మనకు నచ్చిన ప్రాంతానికి రోడ్ ట్రిప్ వెళ్తే.. మన ప్లాన్ అనుకున్న ప్రకారం సాఫీగా సాగిపోతే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. కానీ మనతో పాటు రావాల్సిన వాళ్లలో కొందరు మధ్యలోనే హ్యాండిచ్చి.. మనం ప్రయాణిస్తున్న వాహనం ఉన్నట్లుండి పంచర్ అయ్యి.. మన డబ్బులున్న బ్యాగ్ ఎవరో కొట్టేసి.. ట్రిప్ మధ్యలోనే ఆగిపోతే ఎలా ఉంటుంది? సిద్దార్థ్ నటించిన రోడ్ థ్రిల్లర్ ‘టక్కర్’ రెండో తరహా రైడ్ లాగే హారిబుల్ గా అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిద్ధార్థ్.. ఆ తరహా సినిమాలు చేసి చేసి విసుగెత్తిపోయి ‘టక్కర్’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేసినట్లు చెప్పుకున్నాడు. కానీ సిద్ధు చేసిన ప్రేమకథలు ఎంత మొహం మొత్తినా.. అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ అయినా ఉండేవి. లవర్ బాయ్ పాత్రల్లో సిద్ధుతో ఎంతో కొంత కనెక్ట్ అయ్యేవాళ్లం. కానీ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి రావడం కోసం అతను చేసిన ‘టక్కర్’ను భరించడం మాత్రం చాలా కష్టమే.

రోడ్ థ్రిల్లర్లకు మంచి రెఫరెన్సులు కావాలంటే కార్తి నటించిన ‘ఆవారా’.. సిద్ధునే స్వయంగా నటించిన ‘ఎన్ హెచ్ 4’ లాంటి మంచి సినిమాలున్నాయి. కానీ వాటితో కనీసం పోల్చడానికి కూడా వీల్లేని విధంగా ‘టక్కర్’ను చాలా బోరింగ్ గా తీర్చిదిద్దాడు కార్తీక్ జి.క్రిష్. సిద్ధార్థ్ పాత్రను.. ఈ కథను మొదలుపెట్టిన తీరు చూస్తే ఒక ప్రామిసింగ్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓవైపు డబ్బు లేదన్న అసహనం చెందుతూ.. తనకున్న కోపం వల్ల ఏ పనిలోనూ కుదురుకోలేక ఇబ్బంది పడుతున్న కుర్రాడిగా సిద్ధార్థ్ పాత్రను ఆరంభంలో ప్రెజెంట్ చేసిన విధానం.. ‘‘కోపం రావడానికి కూడా ఒక అర్హత ఉండాలి’’ లాంటి డైలాగులు సినిమా మీద మంచి ఇంప్రెషనే ఇస్తాయి. కొంతసేపు బాగానే టైంపాస్ చేయించే సినిమా.. హీరో జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న దగ్గర్నుంచి గాడి తప్పుతుంది. చనిపోవడానికి కూడా ధైర్యం లేదని బాధ పడే హీరో.. రౌడీలకు కేంద్రంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి వాళ్లను కవ్వించి వాళ్ల చేతుల్లో చనిపోవాలనుకోవడమే చాలా సిల్లీగా అనిపిస్తుంది. బిల్డింగ్ నుంచి దూకి క్షణాల్లో చనిపోవడానికి భయపడేవాడు.. రౌడీల చేతుల్లో చావుదెబ్బలు తిని నరకయాతన అనుభవిస్తూ చనిపోవాలని అనుకోవడం విడ్డూరం. అప్పటిదాకా అంత పిరికివాడిలా ఉన్న వాడు.. ఉన్నట్లుండి రౌడీల మీద తిరగబడి ఎదురొచ్చిన ప్రతి ఒక్కడినీ చితకబాదేయడం.. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ నిపుణులను సైతం ఉతికి ఆరేయడం చిత్రంగా అనిపిస్తుంది.

ఈ లాజిక్కుల సంగతి పక్కన పెడితే.. ఇంటర్వల్ వరకు ఓ మోస్తరుగా అయినా ఎంగేజ్ చేసే ‘టక్కర్’ ద్వితీయార్ధం నుంచి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆల్రెడీ కిడ్నాప్ అయిన హీరోయిన్ని హీరో తీసుకెళ్లిపోవడం.. అతడి వెనుక రౌడీలు పడటం.. ఈ నేపథ్యంలో థ్రిల్లింగ్ సీన్లు చూడబోతున్నాం అనుకుంటే.. దర్శకుడు మాత్రం ఓవైపు విలన్ బ్యాచ్ తో సిల్లీ కామెడీ సీన్లు.. మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య ఫీల్ లేని రొమాంటిక్ సీన్లు పెట్టి సినిమాను ముందుకు నడిపించడానికి నానా తంటాలు పడ్డాడు. మినిమం ఇంట్రెస్టింగ్ కలిగించని సీన్లతో ‘టక్కర్’ సెకండాఫ్.. ఇంకెప్పుడు సినిమా ముగుస్తుందా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. మొదట్లో ఇంట్రెస్టింగ్ గా అనిపించే విలన్ పాత్ర.. తర్వాత జోకర్ లాగా మారిపోతుంది. ఆ పాత్రను పూర్తిగా తేల్చేయడంతో హీరో హీరోయిన్లకు ఏమవుతుందో అన్న టెన్షనే కలగదు. క్లైమాక్సులో ఏమవుతుందో ఊహించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. హిట్లు.. ఫ్లాపులను పక్కన పెడితే సిద్ధు సినిమా అంటే ఏదో ఒక వెరైటీ ఉంటుందనే ఆశను ‘టక్కర్’ నీరుగారుస్తుంది. అతడి ప్రత్యేకత అంటూ ఏమీ కనిపించదు ఈ చిత్రంలో.

నటీనటులు:

సిద్దార్థ్ అంటే ఇప్పటికీ ఒక లవర్ బాయ్ లాగే చూస్తాం. ఐతే అతను తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్ర చేశాడు ‘టక్కర్’లో. ఈ పాత్రలో అతడికి అలవాటు పడటానికి ఎంత ప్రయత్నించినా.. ఫలితం ఉండదు. సినిమా చివరికి వచ్చాక కూడా ఆ పాత్రతో కనెక్ట్ కాలేం. దాన్ని ఓన్ చేసుకోలేం. ఇది సిద్ధు చేయాల్సిన పాత్ర కాదనే ఫీలింగే కలుగుతుంది. తన లుక్ సహా అన్నీ కొంచెం తేడాగా అనిపించాయి ఇందులో. సిద్ధు స్క్రీన్ ప్రెజెన్స్.. నటన సోసోగా అనిపిస్తాయి. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చూడ్డానికి బాగుంది. తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో గ్లామరస్ గా కనిపించింది. తన నటన పర్వాలేదు. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ చాలా మామూలుగా అనిపించాడు. తన పాత్రలోనే ఏ ప్రత్యేకతా కనిపించలేదు. యోగిబాబు కామెడీ ఓ మోస్తరుగా నవ్వులు పంచింది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘టక్కర్’లో పెద్దగా సాంకేతిక మెరుపులేమీ కనిపించలేదు. నివాస్ ప్రసన్న పాటల్లో ఏ ప్రత్యేకతా లేదు. ఏ పాటా వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. వాంజినాథన్ మురుగేశన్ ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. శ్రీనివాస్ కవినయం కథే చాలా సాధారణంగా అనిపిస్తుంది. కార్తీక్ జి.కృష్ణ స్క్రీన్ ప్లేలో కానీ.. దర్శకత్వంలో కానీ ఏ నైపుణ్యం కనిపించలేదు. ఆరంభ సన్నివేశాల వరకు కార్తీక్ పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత కథాకథనాలను ఆసకత్తికరంగా నడిపించలేకపోయాడు. చివరికి వచ్చేసరికి నీరసం తెప్పించేశాడు.

చివరగా: టక్కర్.. బోరింగ్ రైడ్

రేటింగ్ - 1.75/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater