Begin typing your search above and press return to search.

ఆయన బాలయ్యనూ వదిలిపెట్టలేదుగా..

By:  Tupaki Desk   |   30 Jan 2017 3:03 PM IST
ఆయన బాలయ్యనూ వదిలిపెట్టలేదుగా..
X
తెలుగు ఫిలిం సెలబ్రీటలకు సత్కారాలు చేయడం కళాబంధుగా పేరు తెచ్చుకున్న టి.సుబ్బిరామిరెడ్డికి అలవాటు. ఇప్పటికి ఆయన ఎన్ని సత్కారాలు చేశారో లెక్కలేదు. తాజాగా ‘ఖైదీ నెంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని తనదైన శైలిలో సత్కరించారాయన. ఐతే అప్పుడు అందరిలోనూ మరో చర్చ మొదలైంది. 150వ సినిమా చేసిన చిరును సత్కరించారు.. మరి బాలయ్య సంగతేంటి అని. ఈ మాట సుబ్బిరామిరెడ్డి చెవిన పడ్డాయో లేక అప్పటికే నిర్ణయించుకున్నారో కానీ.. బాలయ్యకు కూడా తన స్టయిల్లో సత్కారం చేయబోతున్నారు.

సోమవారం రాత్రి పార్క్ హయత్ హోటల్లో బాలయ్యకు సన్మానం చేయబోతున్నాడు సుబ్బిరామిరెడ్డి. చిరు సత్కారానికి నాగార్జునతో పాటు ఇంకొంతమంది అతిథుల్ని పిలిచాడు సుబ్బిరామిరెడ్డి. మరి బాలయ్య కోసం ఎవరెవరు వస్తారో చూడాలి. మోహన్ బాబు.. దాసరి నారాయణరావు లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. నందమూరి కుటుంబం నుంచి ఎవరెవరు వస్తారు అన్నది కూడా ఆసక్తికరమే. క్రిష్ తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్లో కీలక వ్యక్తులందరూ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. మొత్తానికి అగ్ర హీరోలు ఇద్దరి విషయంలోనూ సమతూకం పాటించడం ద్వారా సుబ్బిరామిరెడ్డి మరోసారి అందరివాడు అనిపించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/