Begin typing your search above and press return to search.

ఆ నటుడు 36 ఏళ్లలో తొలిసారి..

By:  Tupaki Desk   |   23 March 2016 9:30 AM GMT
ఆ నటుడు 36 ఏళ్లలో తొలిసారి..
X
టి.రాజేందర్ తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బాగానే ఫేమస్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ప్రేమసాగరం’ ఒకప్పుడు తెలుగులో సెన్సేషనల్ హిట్టయింది. ఆయనకు ఇక్కడ భారీగా అభిమానగణాన్ని సంపాదించి పెట్టింది. ఐతే టీఆర్ మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. తమిళంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న టీఆర్.. రాను రాను కామెడీ పీస్ అయిపోయాడు. చివరికి సినిమాలు మానేసి తన కొడుకు శిలంబరసన్ అలియాస్ శింబును రంగంలోకి దించాడు. అతను హీరోగా మంచి స్థాయికే ఎదిగాడు.

ఐతే నటుడిగా బాగా గ్యాప్ తీసుకున్న టి.రాజేందర్.. తమిళంలో ఓ సెన్సేషనల్ మూవీతో పునరాగమనం చేయబోతున్నాడు. రంగం.. బ్రదర్స్.. అనేకుడు లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన కె.వి.ఆనంద్.. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నాడు. విశేషం ఏంటంటే.. టి.రాజేందర్ తన 36 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వేరే దర్శకుడి చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేయలేదు. ఒక్క సినిమాలో మాత్రమే క్యామియో రోల్ చేశాడు తప్ప.. వేరే దర్శకులతో ఎప్పుడూ పని చేయలేదు. టీఆర్ అదో టైపు కావడంతో ఆయన్ని తమ సినిమాల్లో పెట్టుకునే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఐతే కె.వి.ఆనంద్ లాంటి టాప్ డైరెక్టర్ టీఆర్ ను ఏరి కోరి ఎంచుకోవడం విశేషం.