Begin typing your search above and press return to search.

కొరటాల పై సోషల్ మీడియాలో సానుభూతి..!

By:  Tupaki Desk   |   14 July 2022 5:30 AM GMT
కొరటాల పై సోషల్ మీడియాలో సానుభూతి..!
X
టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగిన కొరటాల శివ.. 'ఆచార్య' సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. మెగా తండ్రీకొడుకులు చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం.. వారి కెరీర్ లోనే కాకుండా ఇండస్ట్రీలోనే అతి పెద్ద పరాజయాల్లో ఒకటిగా నిలిచింది.

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ ప్లాప్ అవ్వడమే కాదు.. అన్ని ప్రాంతాలలో డిస్ట్రిబ్యూటర్స్ - బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టి పెట్టింది. దీంతో వారందరికీ చాలా వరకు సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కోసం ఎవరూ రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదని.. చేతి ఖర్చుల కోసం మాత్రమే కొంత తీసుకున్నారని మేకర్స్ తెలిపారు. దీంతో బిజినెస్ వ్యవహారాలు - మార్కెటింగ్ చూసుకున్న కొరటాల శివనే నష్టాన్ని భరించాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

ఏదైతేనేం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకున్న కొరటాల పై 'ఆచార్య' ఒత్తిడి పడిందని అంటున్నారు. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో దర్శకుడి సన్నిహితులకే సినిమాని ఇవ్వడంతో.. వారి నుంచి ఇబ్బంది లేకుండా పోయిందట. కానీ మిగతా కొన్ని ఏరియాల బయ్యర్లకు అంతో ఇంతో చెల్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఇప్పటికే కొందరికి తిరిగి చెల్లింపులు జరిగినట్లుగా టాక్ వచ్చింది. ఇది తెలుసుకున్న పలువురు డిస్ట్రిబ్యూటర్లు మరియు కొంతమంది ఎగ్జిబిటర్లు కలసి కొరటాల ఆఫీస్ కు వచ్చారని.. కొంతభాగం సెటిల్ చేసి పంపించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరటాల పై సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్లుగా 'ఆచార్య' సినిమా కోసమే కొరటాల శివ వర్క్ చేసారని.. కానీ ఇప్పుడు నష్ట భారం కూడా మోయాల్సి రావడం బాధాకరమని ట్వీట్లు పెడుతున్నారు. కొరటాల మనస్తత్వం, వ్యవహార శైలి తెలిసిన వాళ్లంతా సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో #JusticeforKoratalaShiva #JusticeforKoratala అనే హ్యాష్ ట్యాగ్ తో దర్శకుడికి మద్దతు తెలుపుతున్నారు.

సినిమా లేదా ఏదైనా వ్యాపారంలో లాభనష్టాలు కూడా భాగమే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఇక్కడ 'ఆచార్య' చిత్రంతో బయ్యర్లు భారీగా నష్టపోవడంతోనే ఇంత రచ్చ జరుగుతోందని అంటున్నారు. గతంలోనూ కొరటాల తాను డైరెక్ట్ చేసే సినిమాల ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకున్నారు. కొత్త ప్రొడ్యూసర్స్ అవడం.. పైగా వారంతా స్నేహితులే కావడంతో బిజినెస్ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చానని దర్శకుడు చెప్పారు. అదే విధంగా ఇప్పుడు 'ఆచార్య' సినిమా విషయంలోనూ కొరటాల జోక్యం చేసుకున్నారు.

కాకపోతే ఇంతకముందు సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి.. లాభాలు తెచ్చిపెట్టాయి కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం డిజాస్టర్ పడటంతో ఈ నష్ట పరిహారం వ్యవహారాలు చూడాల్సిన పరిస్థితి వచ్చిందనేది అర్థమవుతోంది. ఏదేమైనా దీన్నుంచి కొరటాల త్వరగా బయటపడి NTR30 ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.