Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటున్న భామ

By:  Tupaki Desk   |   21 April 2020 11:20 AM IST
లాక్ డౌన్: ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటున్న భామ
X
డిప్రెషన్.. మానసిక ఆరోగ్యం లాంటి పదాలను వింటే మన సమాజం ఎందుకో వింతగా చూస్తుంది. నిజానికి పలు కారణాల వల్ల ఒక వ్యక్తి డిప్రెషన్లోకి జారుకునే అవకాశం ఉంది. కొంత మేరకు కుటుంబ సభ్యుల మద్దతు.. అవసరమైతే డాక్టర్ ట్రీట్మెంట్ తో అందులో నుంచి ఆ వ్యక్తిని బయటకు తీసుకు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇదేమీ తప్పు కాకపోయినా మన సమాజంలో మానసిక సమస్యలకు డాక్టర్ దగ్గరికి వెళ్లడం అనేది ఒక తప్పుగా భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కొంతకాలం క్రితం దీపికా పదుకొనే డిప్రెషన్ కు గురయ్యానని ఒక థెరపిస్ట్ ను సంప్రదించి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అని తెలిపింది. ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా మానసిక ఆరోగ్యం గురించి ప్రజలలో అవగాహన పెంచాలని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా మరో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఈ విషయంపై మాట్లాడింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఉద్యోగం ఉంటుందా ఉండదా.. జీతంలో కోత పడుతుందా.. ఈ కరోనా బారి నుంచి మనం మన ప్రాణాలను.. కుటుంబసభ్యుల ప్రాణాలను రక్షించుకోగలమా అంటూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. శ్వేతా బసు ప్రసాద్ కూడా లాక్ డౌన్ కారణంగా ఒత్తిడికి గురైందట. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న శ్వేత గత ఏడాది తన భర్త రోహిత్ నుండి విడాకులు కూడా తీసుకుంది. అప్పుడే శ్వేత ఒక థెరపిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుందట. భర్త నుంచి విడిపోయిన తర్వాత శ్వేత తన తల్లిదండ్రుల దగ్గరకు పోకుండా సింగిల్ గానే ఉంటోందట. ఈమధ్య లాక్ డౌన్ ప్రకటించడంతో ఆందోళనకు గురైందట. దీంతో వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్ తో మాట్లాడానని.. ట్రీట్మెంట్ తీసుకున్నానని తెలిపింది. ఇది చాలా సహజమైన విషయం అని.. మానసిక ఆరోగ్యానికి మన సమాజం ప్రాముఖ్యతను ఇవ్వాలని శ్వేత అభిప్రాయపడింది.

హిందీ టీవీ సీరియల్స్ ద్వారా భారీ పాపులారిటీ సాధించిన శ్వేత 'కొత్త బంగారులోకం' సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమా ఘన విజయం సాధించడంతో ఆఫర్లు వచ్చాయి. కానీ తర్వాత సినిమాలన్నీ నిరాశపరచడంతో కెరీర్ డల్ అయింది. ఆ తర్వాత ముంబైకి మకాం మార్చి అక్కడ సీరియల్స్ లో యాక్ట్ చేస్తోంది. మధ్యలో కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది.