Begin typing your search above and press return to search.

బన్సాలీని ఏకేసిన ఆ నటి

By:  Tupaki Desk   |   28 Jan 2018 11:20 AM GMT
బన్సాలీని ఏకేసిన ఆ నటి
X
సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘పద్మావత్’ సినిమా ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అనేక అడ్డంకుల్ని దాటుకుని ఎట్టకేలకు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిందా సినిమా. ఈ సినిమాకు వ్యతిరేకంగా బయటి వాళ్లు ఆందోళనలు చేస్తున్నారు కానీ సినీ పరిశ్రమ నుంచి దీనికి తిరుగులేని మద్దతు లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఆహా ఓహో అంటూ పొగిడేస్తూ.. దీనికి మద్దతుగా నిలుస్తున్నారు ఫిలిం సెలబ్రెటీలు. ఇలాంటి తరుణంలో ఒక నటి ‘పద్మావత్’ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమా చివర్లో తన భర్త యుద్ధంలో మరణించగానే పద్మావతి తన అనుచర మహిళలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. అంతరించిన ఇలాంటి దుస్పంప్రదాయాల్ని సినిమాలో చూపించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ బన్సాలీకి 8 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. అందులో స్వర ఏమందంటే..

‘‘పద్మావత్‌ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు? ఈ సినిమా చివర్లో పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. ఇప్పుడున్నది 13వ శతాబ్దం కాదు. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన.. ఆత్మాభిమానం.. గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో క్రమంంగా మనో ధైర్యం కూడా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్‌ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు? అత్యాచార బాధితులు... వితంతువులు.. గర్భవతి... ఇలా అందరు మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. సతీ సహగమనం.. జౌహర్‌ (ఓడిపోయిన రాజుల కుమార్తెలు.. భార్యలు.. బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా.. స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) లాంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి కానీ ‘పద్మావత్‌’లో ఈ దుస్సంప్రదాయాన్ని చూపించడం ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి’’ అని స్వర భాస్కర్ అంది. మరి దీనిపై బన్సాలీ అండ్ కో ఏమంటారో చూడాలి.