Begin typing your search above and press return to search.

నాది లవ్ మ్యారేజ్.. అది జరగడానికి కారకుడు ఎన్టీఆర్!

By:  Tupaki Desk   |   23 Aug 2022 1:30 PM GMT
నాది లవ్ మ్యారేజ్.. అది జరగడానికి కారకుడు ఎన్టీఆర్!
X
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు .. భారీ విజయాలను అందుకున్నారు. వైజయంతి అనే పేరును పెట్టింది కూడా ఎన్టీ రామారావుగారేనని రీసెంట్ గా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఈ సంస్థ 'లోగో'లోను కృష్ణుడిగా ఎన్టీ రామారావు స్టిల్ ఉంటుంది. అలాంటి అశ్వనీదత్ కి ఎన్టీ రామారావుగారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉండటం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ తోను ఈ బ్యానర్లో సినిమాలు వచ్చాయి.

అయితే ఆ మధ్య వరుస పరాజయాల కారణంగా అశ్వనీదత్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనే అశ్వనీదత్ రెండవ కుమార్తె స్వప్న దత్ నిర్మాతగా రంగంలోకి దిగారు.

స్వప్న సినిమాస్ బ్యానర్లో ఆమె నిర్మించే సినిమాలకు వైజయంతి మూవీస్ కూడా తోడైంది. ఈ రెండు బ్యానర్లు కలిసి ఈ మధ్య కాలంలో మూడు సినిమాలను నిర్మించాయి .. ఆ మూడు కూడా ఘనవిజయాలను అందుకున్నాయి. అందుకు కారణం స్వప్న దత్ అనే పేరు ప్రధానంగా వినిపించింది.

స్వప్న దత్ వివాహం 2010లో డిసెంబర్ 19వ తేదీన ప్రసాద్ వర్మతో జరిగింది. ఆ వివాహం వెనుక ఎన్టీఆర్ ఉన్నాడనే టాక్ అప్పట్లో బలంగా వినిపించింది. తాజా ఇంటర్యూలో ఆ ప్రస్తావన రావడంతో స్వప్న దత్ స్పందించారు.

"మొదటి నుంచి కూడా నాకు .. జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తను నా బ్యానర్లో చేసినా చేయకపోయినా తరచూ మాట్లాకుంటూనే ఉంటాము. నా ప్రేమ విషయం ఆయనకి తెలుసు. ప్రేమ వివాహానికి మా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు.

ఒక సినిమా షూటింగులో ఉండగా ఎన్టీఆర్ కి ఈ విషయం తెలిసింది. 'ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదు .. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను' అంటూ ఆయన మేకప్ కూడా తీయకుండా మా ఇంటికి వెళ్లారు. నా గురించి మా నాన్నగారితో మాట్లాడి ఒప్పించారు. అలా నా లవ్ మ్యారేజ్ కి ఎన్టీఆర్ కారణమయ్యారు .. నా పెళ్లి విషయంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. అందుకు ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.