Begin typing your search above and press return to search.

SVP : ఆ ఒక్క సీన్ కోసం మహేష్ 10 రోజుల కష్టం

By:  Tupaki Desk   |   11 May 2022 11:30 AM GMT
SVP : ఆ ఒక్క సీన్ కోసం మహేష్ 10 రోజుల కష్టం
X
కరోనా ప్రారంభంకు ముందు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అయ్యింది. ఆ తర్వాత మహేష్‌ బాబు సినిమా రాలేదు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దానికి తోడు సినిమా ట్రైలర్‌ సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది.

సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా మహేష్ బాబు అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందని దర్శకుడు పరశురామ్‌ నమ్మకంగా చెబుతున్నాడు.

తప్పకుండా ఈ సినిమా మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండి పోయేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. పోకిరి దూకుడు రేంజ్ లో ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో మహేష్ బాబు అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల కోసం మహేష్‌ బాబును కాస్త ఎక్కువగానే కష్టపెట్టినట్లుగా ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్ మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అదే విషయమై మహేష్‌ బాబును తాజా ఇంటర్వ్యూలో సినిమాలో ఎక్కువగా కష్టపడ్డ సన్నివేశం లేదా యాక్షన్ సన్నివేశం ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఆ సందర్బంగా మహేష్ బాబు స్పందిస్తూ.. ఈ సినిమాలో బీచ్‌ లో ఒక ఫైట్‌ సన్నివేశం ఉంటుంది. ఆ ఫైట్‌ సన్నివేశం కోసం ఎక్కువగా కష్టపడ్డాను. పది రోజుల పాటు ఆ యాక్షన్‌ సన్నివేశం షూటింగ్‌ జరిగిందని ఆయన అన్నాడు. సినిమాలో ఆ ఫైట్‌ సన్నివేశం ప్రథాన ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వైజాగ్ ఆర్కే బీచ్ లో ఆ ఫైట్ సన్నివేశం చేయాలని మొదట భావించారు. కాని పది రోజుల పాటు అక్కడ షూటింగ్ అంటే జనాలను కంట్రోల్‌ చేయడం కష్టం అనే ఉద్దేశ్యంతో రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ బీచ్ సెట్టింగ్‌ ను వేయించినట్లుగా యూనిట్‌ సభ్యులు ఇటీవలే చెప్పుకొచ్చారు. అదే సెట్టింగ్‌ లో యాక్షన్‌ సన్నివేశం కోసం మహేష్ బాబు కాస్త ఎక్కువగా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.