Begin typing your search above and press return to search.

ఆ విషయంలో నేను తప్పటడుగు వేశాను: ఎస్వీ కృష్ణారెడ్డి

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:30 PM GMT
ఆ విషయంలో నేను తప్పటడుగు వేశాను: ఎస్వీ కృష్ణారెడ్డి
X
ఎస్వీ కృష్ణారెడ్డి పేరు వినగానే ఆయన సినిమాల్లో ముందుగా గుర్తుకువచ్చేది 'యమలీల'. ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాల వారిని అలరించింది. అప్పటివరకూ కమెడియన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన అలీ, ఈ సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ తరువాత ఎస్వీ కృష్ణారెడ్డి తానే హీరోగా 'ఉగాది' .. 'అభిషేకం' సినిమాలను చేశారు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ విషయాన్ని గురించిన ప్రశ్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' వేదికపై కృష్ణారెడ్డికి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "హీరోగా ముందుగా నేను ఒక కథను అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదు. దాంతో వెంటనే దానిని పక్కన పెట్టేసి 'ఉగాది' సినిమాను చేశాను.

ఈ సినిమా హిట్టే .. 100 రోజులు ఆడింది. నేను చేసిన మ్యూజిక్ ఆ సినిమాను చాలావరకూ నిలబెట్టింది. 'అభిషేకం' విషయానికి వస్తే .. ఆ సినిమా విషయంలో నేను సంతృప్తిని పొందలేకపోయాను.

ఆ సినిమా ఇప్పుడు టీవీల్లో మంచి హిట్టే కానీ, అప్పటికి అది హిట్ కాదు. దాంతో ఇక హీరోగా చేయడం ఆపేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాను. జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పటడుగు వేస్తాడు .. నేను కూడా వేశాను.

కాకపోతే నేను చేసిన ఒక మంచిపని ఏమిటంటే, ఆ రెండు సినిమాలను సొంతంగా చేసుకున్నామే గానీ, బయటవాళ్లతో చేయలేదు. భాగస్వాములు నష్టపోకుండా వాళ్లకి డబ్బు కట్టేశాను. హీరోగా నేను ఎందుకు సక్సెస్ కాలేదంటే నేనేమీ గొప్ప ఆర్టిస్టును కాదు. నాకంటే శ్రీకాంత్ .. జగపతిబాబు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే నేను ఎక్కువగా వాళ్లతో చేశాను గనుక చెబుతున్నాను.

నేను వాళ్లంతటి ఆర్టిస్టును అవుతానా అంటే కాలేనని నాకు తెలుసు. మరి అలాంటప్పుడు హీరోగా ఎందుకు ప్రయత్నించానంటే, అసలు హీరో కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చాను గనుక.

నేను హీరోగా చేయాలనుకున్నాను .. చేశాను. అవి ఆడాయా లేదా అనేది అలా ఉంచితే, చేశానా లేదా అనేది మాత్రమే నేను ఆలోచించాను. నేను నా మీద ప్రాక్టికల్స్ చేసుకున్నాను. ఫలితం కోసం ఆశించకుండా .. ఆలోచించకుండా నా ప్రయత్నాలు నేను చేస్తూ వెళ్లాను.

కొన్నిటికి మంచి జరిగింది .. కొన్నిటికి చెడు జరిగింది. అలీని హీరోని చేసినవాడిని నేను .. నేను హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోవడంలో నా మైనస్ లు నాకు ఉన్నాయి. కాకపోతే హీరోని అవుదామని వచ్చినవాడిని .. నా ఆశను నేను తీర్చుకోలేకపోతే ఎట్లా" అంటూ చెప్పుకొచ్చారు.