Begin typing your search above and press return to search.

డిజిటల్ ఎంట్రీకి వెంకీ - నాగ్ - బాలయ్య ఓకే.. చిరు నాట్ ఓకే..!

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:13 PM GMT
డిజిటల్ ఎంట్రీకి వెంకీ - నాగ్ - బాలయ్య ఓకే.. చిరు నాట్ ఓకే..!
X
ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందరికీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో బిగ్ స్టార్స్ కూడా ఓటీటీ కంటెంట్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో వెబ్ కంటెంట్ హవా ఇలానే కొనసాగుతుందని భావించి.. ఒరిజినల్ ఫిలిమ్స్ - వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఓటీటీ బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు.

సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటి తో కలసి ''రానా నాయుడు'' అనే క్రైమ్-డ్రామా సిరీస్ చేస్తున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా రూపొందే ఈ సిరీస్ కు ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఇది వెంకీ - రానా లకు డెబ్యూ సిరీస్.

ఇదే క్రమంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం ''అన్ స్టాపబుల్'' అనే టాక్ షో చేస్తున్నారు బాలయ్య. పవర్ ఫుల్ డైలాగ్స్ తో, భారీ యాక్షన్లతో దుమ్ములేపే బాలయ్య.. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు హోస్ట్ గా చేస్తుండటంతో అందరి దృష్టి ఈ కార్యక్రమం మీద పడింది. మారుతున్న పరిస్థితులతో పాటుగా మనమూ మారాలని.. మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి రెడీ అని బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇప్పటికే బుల్లితెర మీద హోస్ట్ గా అదరగొడుతున్న కింగ్ అక్కినేని నాగార్జున.. వెబ్ కంటెంట్ లో నటించాడని రెడీ అయ్యారు. తనయుడు నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ కోసం ఓ హారర్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నాగ్ సరైన స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని నాగార్జున స్వయంగా వెల్లడించారు. కొత్తదనానికి వెల్ కమ్ చెప్పడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండే నాగ్.. త్వరలోనే డిజిటల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇలా ముగ్గురు టాలీవుడ్ సీనియర్ హీరోలు డిజిటల్ వరల్డ్ లో ఎంటర్ అవుతుంటే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కుర్ర హీరోలు ఆశ్చర్యపోయేలా సినిమాలు కమిట్ అవుతున్న చిరు.. రెండు ఓటీటీ ఆఫర్లను రిజెక్ట్ చేశారట. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ మెగాస్టార్ తో తక్కువ నిడివి గల ఓ ఒరిజినల్ ఫిలిం ప్లాన్ చేసిందట. చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత సహకారంతో దీన్ని బాస్ వద్దకు తీసుకెళ్లారట.

ఇది మెగా ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో పాటు సామాజిక సందేశనిచ్చే స్టోరీ అట. ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అని.. కేవలం 25 రోజుల కాల్షీట్ ఇస్తే చాలని చిరంజీవి ని కోరారట సదరు ఓటీటీ ప్రతినిధులు. అయితే చిరు ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట. ఇదే క్రమంలో ఓ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ రోల్ కోసం సంప్రదించారట. అయితే మంచి పాత్ర అయినప్పటికీ చిరంజీవి వెబ్ సిరీస్ లో నటించడానికి నిరాకరించారట.

దీనిని బట్టి చూస్తే ప్రస్తుతానికి చిరు తొలి ప్రాధాన్యత బిగ్ స్క్రీన్ కే అనే విషయం అర్ధం అవుతోంది. మరి భవిష్యత్ లో తన బావమరిది అల్లు అరవింద్ కు చెందిన 'ఆహా' ఓటీటీ వేదిక కోసం ఏదైనా వెబ్ మూవీ చేయడానికి మెగాస్టార్ ముందుకు వస్తారేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' తో పాటుగా 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' 'వాల్తేరు వీరయ్య'(పరిశీలనలో ఉంది) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.