Begin typing your search above and press return to search.

దాసరి ప్రభు వచ్చినా సస్పెన్స్‌ కొనసాగుతోంది

By:  Tupaki Desk   |   20 Jun 2019 10:28 AM GMT
దాసరి ప్రభు వచ్చినా సస్పెన్స్‌ కొనసాగుతోంది
X
దర్శకరత్న దాసరి నారాయణరావు బతికి ఉన్న సమయంలో ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన వద్దకు వెళ్లే వారు. టాలీవుడ్‌ కు పెద్ద దిక్కుగా నిలిచిన దాసరి నారాయణ రావు మరణం తర్వాత టాలీవుడ్‌ మాత్రమే కాకుండా ఆయన కుటుంబం కూడా పెద్ద దిక్కు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇద్దరి కొడుకుల మద్య ఆస్తుల తగాదాలు తారా స్థాయికి చేరాయి. దాసరి బతికి ఉన్న సమయంలోనే ఆస్తుల పంపకం విషయంను మోహన్‌ బాబుతో పాటు మరికొందరికి అప్పగించి వీలునామా రాయడం జరిగింది. కాని వారు ఆస్తుల పంపకం విషయంలో విఫలం అయ్యారు. తాజాగా దాసరి పెద్ద కుమారుడు కనిపించకుండా పోవడం చర్చనీయాంశం అయ్యింది.

దాసరి ప్రభు కనిపించకుండా పోయాడంటూ ఆయన మామ ఫిర్యాదు ఇవ్వడం.. పోలీసులు తెలుగు రాష్ట్రాలను జల్లెడ పట్టడం జరిగింది. అయితే పోలీసులు వెదుకుతున్న సమయంలోనే దాసరి ప్రభు తన ఇంటికి వచ్చేశాడు. పోలీసు కేసు నమోదు అయిన నేపథ్యంలో ప్రభును పోలీసులు స్టేషన్‌ కు పిలిపించి ఎంక్వౌరీ చేయడం జరిగింది. అయితే ఎంక్వౌరీలో పోలీసులకు ప్రభు రకరకాల సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభు చెబుతున్న పొంతన లేని కథనాలతో అసలు ప్రభు ఎక్కడకు వెళ్లాడనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఒక మహిళ తనను ఇక్కడ నుండి తీసుకు వెళ్లిందని చెప్పిన ప్రభు ఆ తర్వాత మాట మార్చి తాను ముంబయి వెళ్లినట్లుగా పోలీసులకు చెప్పాడట. ఆ తర్వాత మరో మాట ఇలా రకరకాలుగా మాటలు మార్చడంతో అసలు ప్రభు ఎటు వెళ్లాడనే విషయంపై పోలీసులు జుట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రభు మొదటి భార్య తీసుకు వెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందనే విషయంపై పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ప్రభు మొదటి భార్య గత కొంత కాలంగా ఆసక్తి కోసం పోరాడుతోంది. కనుక ఆమె తీసుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అయితే ప్రభు ఏం చిన్న పిల్లాడు కాదు కదా వెంట తీసుకు వెళ్లడానికి.. ఆయన ఇష్టం లేకుండా ఎలా తీసుకు వెళ్లగలుగుతారు అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభు తిరిగి వచ్చినా కూడా సస్పెన్స్‌ అనేది కొనసాగుతూనే ఉంది.