Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందా...?

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:30 PM IST
సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందా...?
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు పూర్తయిందని.. ఈ సెన్సేషనల్ కేసును విచారించిన సీబీఐ త్వరలోనే దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ పాట్నా కోర్టుకు సమర్పించనుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వైద్య బృందం సుశాంత్ శవపరీక్ష రిపోర్ట్ ఇప్పటికే సీబీఐకి నివేదించింది. సుశాంత్ శరీరంలో ఎలాంటి విషం లేదని.. హత్య అని అనుమానించదగినదేమీ లేదని.. అది ఆత్మహత్యే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా కథనాల ప్రకారం సీబీఐ ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసింది.. అలానే యువ హీరో మరణంలో అనుమానించదగినదేమీ కనిపించనందున ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్లు సీబీఐ కోర్టుకు నివేదిక అందించనుందని తెలుస్తోంది.

కాగా, జూన్‌ 14న సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని అనేకమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇదే క్రమంలో సుశాంత్ అకౌంట్ నుంచి అతని గర్ల్ ఫ్రెండ్ రియా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో సీబీఐ మరియు ఈడీ రంగంలోకి దిగి ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారించారు. అదే సమయంలో ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా సహా పలువురిని అరెస్ట్ చేసింది. దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రియా చక్రవర్తి.. ఇటీవలే బెయిల్‌ పై విడుదలైంది.