Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతి కేసులో మరో సంచలన కుట్ర?

By:  Tupaki Desk   |   6 Oct 2020 1:20 PM IST
సుశాంత్ మృతి కేసులో మరో సంచలన కుట్ర?
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు. ఇప్పటికే సుశాంత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. తాజాగా మరో అనూహ్య కోణం వెలుగులోకి వచ్చింది.

సుశాంత్ కేసులో తవ్వినకొద్దీ సంచలన ఉదంతాలు బయటకొస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు కూడా సుశాంత్ కేసుతోనూ బయటపడ్డాయి. తాజాగా ఈ కేసులో మరో కొత్త కోణాన్ని ముంబై సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు.

సుశాంత్ సింగ్ కేసు వ్యవహారంలో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను తెలుపుకోవడానికి వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల మీద వాటిని ఉద్దేశపూర్వకంగా సృష్టించారని పోలీసులు గుర్తించారు. దాదాపు 80వేలకు పైగా సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను సృష్టించినట్లు నిర్ధారించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల వైఫల్యాన్ని వారి మీద బురద చల్లడానికే నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను వేదికగా మార్చుకున్నారని పోలీసులు తేల్చారు. దీనిపై ముంబై పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసునమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

వేర్వేరు దేశాల్లో వాటిని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ముంబై పోలీస్ విభాగానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడించారని జాతీయ మీడియా ఒకటి వెల్లడించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల ద్వారా ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వంపై విదేశీ భాషల్లో తమ కామెంట్లు చేశారని.. ఇవన్నీ ఒకే ట్యాగ్ లైన్ కావడం వల్ల సులభంగా గుర్తించామని ఈ ఐపీఎస్ అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. హ్యాష్ ట్యాగ్స్ ను వినియోగించినట్లు తేలిందని పేర్కొంది.

ఈ కొత్త పరిణామంపై పలువురు ప్రముఖులు ఆ జాతీయ మీడియా వెబ్ సైట్ ప్రచురించిన కథనాన్ని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, నటుడు ప్రకాష్ రాజ్ లు తీవ్ర విమర్శలు చేశారు. సుశాంత్ మరణాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని.. దీనివెనుక కుట్ర కోణాన్ని ఛేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సుశాంత్ కేసుపై అనుమానాలను లేవనెత్తారు.దీని వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చుతామని సంజయ్ రౌత్ చెప్పారు.