Begin typing your search above and press return to search.

సుశాంత్ బయోపిక్ అంటూ వార్తల్లో నిలిచిన వివాదాస్పద క్రిటిక్..!

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:15 AM GMT
సుశాంత్ బయోపిక్ అంటూ వార్తల్లో నిలిచిన వివాదాస్పద క్రిటిక్..!
X
బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటుడిగా కమల్ ఆర్ ఖాన్ కి గొప్ప పేరే వుంది. సినీ విమర్శకుడు అని చెప్పుకునే కేఆర్కే ఇండస్ట్రీ ప్రముఖుల మీదా.. సినిమాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు. ముఖ్యంగా మన సౌత్ ఇండియా యాక్టర్స్ పై.. సినిమాల పై ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ మనవారి ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. ఇటీవల లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ లు చనిపోతారని నాకు ముందే తెలుసని ట్వీట్స్ చేసి నెటిజన్ల తిట్లకి బలయ్యాడు. ఇప్పుడు తాజాగా సుశాంత్ మృతిపై వరుస ట్వీట్స్ చేస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త విన్న యావత్ సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి రాజకీయ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖుల వల్ల సుశాంత్ సింగ్ మనస్తాపానికి గురయ్యారని.. అందుకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పలువురు తమ ట్వీట్లలో పేర్కొన్నారు. బాలీవుడ్ లో ఓ వర్గం మాఫియాలా మారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఫేవరిజం లాంటి వాటి వలన టాలెంటెడ్ యాక్టర్స్ తొక్కివేయబడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ బయోపిక్‌ అనే వార్త తెరపైకి వచ్చింది. కమాల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు.

అందరిపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచే ఈ సినీ క్రిటిక్ కేఆర్కే.. "ఒట్టేసి చెబుతున్నాను. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ బయోపిక్ నిర్మిస్తాను. ఈ సినిమా ద్వారా సుశాంత్ మరణానికి కారణమైన నేరస్థులని బయటపెడతాను. బాలీవుడ్ ప్రజలని ద్వేషించడం నాకు చాలా ఇష్టం. సుశాంత్‌ కి న్యాయం జరగాలి" అంటూ కేఆర్కే తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఎవరెన్ని చెప్పినా బెదిరించినా సుశాంత్ బయోపిక్ నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే సుశాంత్ అభిమానులు మాత్రం కేఆర్కే పై మండిపడుతున్నారు. సుశాంత్ బయోపిక్ తీసే అర్హత కేఆర్కే లేదని విమర్శిస్తున్నారు. గతంలో సుశాంత్ యాక్టింగ్ పై బ్యాడ్ కామెంట్స్ చేసిన కమల్ ఆర్ ఖాన్ వీడియోలను.. సుశాంత్ పై ఆయన పెట్టిన ట్వీట్స్ ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగే పనికిమాలిన మాటలు మాట్లాడుతూ డబల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.