Begin typing your search above and press return to search.

సూర్య సినిమా ఫిక్సయింది

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:49 AM GMT
సూర్య సినిమా ఫిక్సయింది
X
సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తాడు. బలమైన కథలు ఎంచుకుంటాడు. ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడానికి ఎంతో కష్టపడతాడు. సినిమా కాస్త నిరాశాజనకంగా ఉన్నప్పటికీ తన నటనతో ఆ లోపాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే సూర్య అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. తమిళనాటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడికి భారీ గా అభిమాన గణం ఉంది. ఐతే సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ సూర్యకు ఈ మధ్య ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. ఈ ఏడాది ‘గ్యాంగ్’తో నిరాశ పరిచాడతను. అంతకుముందు వచ్చిన రెండు మూడు సినిమాలు కూడా అంచనాల్ని అందుకోలేకపోయాయి. దీంతో అతను మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సూర్య సినిమాలూ చాలా ప్రత్యేకంగానే కనిపిస్తున్నాయి.

అందులో ఒకటి ‘ఎన్జీకే’. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సూర్య-సెల్వ కాంబినేషనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెల్వ సినిమాలు ఒక పట్టాన పూర్తి కావు. అతను పర్ఫెక్షన్ కోసం చాలా సమయం తీసుకుంటాడు. అందుకే ‘ఎన్జీకే’ వాయిదా పడింది. మధ్యలో సంక్రాంతి రిలీజ్ అన్నారు. అది కూడా కష్టమైపోయింది. జనవరి తర్వాత అన్ సీజన్ కాబట్టి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదని వేసవికి వాయిదా వేసేశారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేసేశారు. ఆ రోజు తమిళ సంవత్సరాది. ప్రతి ఏడాదీ ఆ తేదీకి భారీ చిత్రం ఒక్కటైనా షెడ్యూల్ అవుతుంది. వచ్చే ఏడాదికి సూర్య బెర్తు బుక్ చేసుకున్నాడు. ‘ఎన్జీకే’లో సూర్య సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండటం విశేషం. దీంతో పాటుగా సూర్య.. కె.వి.ఆనంద్ దర్శకత్వంలోనూ ఓ భారీ సినిమా చేస్తున్నాడు.