Begin typing your search above and press return to search.

200 కోట్ల బడ్జెట్ తో సూర్య సినిమా..?

By:  Tupaki Desk   |   9 Sep 2021 3:30 AM GMT
200 కోట్ల బడ్జెట్ తో సూర్య సినిమా..?
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తమిళులే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు అభిమానించే స్థాయికి చేరుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీగా మార్కెట్ ఏర్పరచుకున్నాడు. గతేడాది 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో నట విశ్వరూపాన్ని చూపించిన సూర్య.. ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. వాటిలో 'వాడివసల్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ - సూర్య కాంబినేషన్ లో ''వాడివసల్'' సినిమా తెరకెక్కుతోంది. ఇది సూర్య కెరీర్ లో వస్తున్న 40వ చిత్రం. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. మెడలో తాడు, పులిగోరుతో సూర్య డిఫెరెంట్ లుక్ లో కనిపించి మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇందులో హరప్పా - సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మలను చూపించి సినిమాపై ఆసక్తిని కలిగించారు.

అయితే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ''వాడివసల్'' సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే చిత్రంగా నిలుస్తోందట. దీని కోసం నిర్మాతలు దాదాపు రూ. 200 కోట్ల ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సూర్య మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టి రిస్క్ చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇకపోతే ''వాడివసల్'' సినిమాని మదురై బ్యాక్ డ్రాప్ లో.. తమిళుల సాంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దీని కోసం సూర్య బుల్ ఫైట్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఇందులో తండ్రీ కొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఆండ్రియా ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. వేల్ రాజా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉండగా సూర్య హీరోగా నటించిన మల్టీలాంగ్వేజ్ మూవీ ''జై భీమ్'' అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ లో విడుదల కాబోతోంది. 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అణగారిన వర్గాలు - గిరిజన తెగల హక్కులు, వారి సమస్యలపై పోరాడే పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో సూర్య కనిపించనున్నారు. అలానే పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య నటిస్తున్న '#Suriya40' షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందే ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.