Begin typing your search above and press return to search.

సూర్య 40వ సినిమా సంథింగ్ స్పెషల్ అట!

By:  Tupaki Desk   |   9 April 2021 4:15 PM IST
సూర్య 40వ సినిమా సంథింగ్ స్పెషల్ అట!
X
మొదటి నుంచి కూడ సూర్య విభిన్నమైన .. విలక్షణమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. కోలీవుడ్ లో కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చే హీరోల్లో కమల్ .. విక్రమ్ తరువాత స్థానంలో సూర్యనే కనిపిస్తాడు. అలా కొత్తదనం కోసం ఆయన తాపత్రయపడటం వల్లనే, ప్రేక్షకుల ముందుకు 'ఆకాశం నీ హద్దురా' సినిమా వచ్చింది. అనూహ్యమైన రీతిలో కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళ్లింది. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. సూర్య తన కెరియర్లోనే చేసిన అత్యుత్తమమైన ప్రయోగంగా ప్రశంసలు అందుకుంది.

అలాంటి సూర్య .. పాండిరాజ్ దర్శకత్వంలో మరో విభిన్నమైన పాత్రను చేస్తున్నాడు. సంఖ్యా పరంగా ఇది ఆయనకు 40వ సినిమా. అందువలన కథాకథనాల విషయంలోను .. లుక్ విషయంలోను ఆయన మరింత శ్రద్ధ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చకచకా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన స్టిల్ కి అనూహ్యామైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య లుక్ డిఫరెంట్ గా ఉంది .. ఆయన ఖడ్గం పట్టుకుని నడుస్తున్న తీరు చూస్తుంటే, కథా నేపథ్యమే భిన్నంగా ఉండనుందనే విషయం అర్థమైంది. ఇది ఆయన కెరియర్లోనే సంథింగ్ స్పెషల్ మూవీ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

సూర్య ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. సూర్య బాడీ లాంగ్వేజ్ .. ఆయన డైలాగ్ డెలివరీ పూర్తి భిన్నంగా ఉంటాయని అంటున్నారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పాండిరాజ్ కి కోలీవుడ్ లో మంచి పేరు ఉండటం, ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. కోలీవుడ్ లో కుదురుకోవడానికి ఇదే తనకి సరైన అవకాశంగా ఆమె భావిస్తోంది.