Begin typing your search above and press return to search.

యాక్షన్ హీరోను ఆటాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   23 April 2016 3:30 PM GMT
యాక్షన్ హీరోను ఆటాడుకుంటున్నారు
X
సినిమా హీరోలు సినిమా హీరోలుగా ఉంటూ తమ సినిమాల్లో ఏం చూపించినా చెల్లిపోతుంది. కానీ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడితేనే ఇబ్బంది. సినిమాల్లో నీతి వాక్యాలు వల్లించేసి.. రాజకీయాల్లోకి వచ్చాక ఏదైనా దానికి భిన్నంగా ప్రవర్తిస్తే తేడా కొట్టేస్తుంది. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నాడు. సురేష్ మల్లూ వుడ్లో పెద్ద యాక్షన్ హీరో. పోలీస్ వేషాలకు అతను పెట్టింది పేరు. ఆ వేషాల్లో తెరమీద ఎందరో రాజకీయ నాయకుల్ని ఓ ఆట ఆడుకున్నాడు. భారీ డైలాగులు పేల్చాడు.

ఓ సినిమాలో రాజకీయనాయకుడైన విలన్ని ఉద్దేశించి.. అతను పలికిన డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నికల్లో ప్రజల ప్రేమాభిమానులతో గెలవలేని రాజకీయ నాయకులే దొడ్డిదారిన పార్లమెంటులో అడుగుపెడతారని.. అలాంటి నాయకులు సమాజానికి పట్టిన చీడపురుగుల్లాంటోళ్లని అంటాడు సురేష్ అందులో. ‘'బాగా డబ్బున్న ఎన్నారైలు.. మద్యం వ్యాపారులు నల్ల డబ్బును ఎరగా వెదజల్లి ఇలాంటి విలువైన పదవులు కొనుక్కుంటున్నారు'’ అని కూడా ఓ డైలాగ్ ఉంది అందులో. ఎందుకంటే నరేంద్ర మోడీ సర్కారు సురేష్ గోపీని ఈ మధ్యే రాజ్యసభకు నామినేట్ చేసింది. ఐతే దీని కంటే ముందే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడమని కోరుతూ ఆయనకు టికెట్ ఆఫర్ చేసింది బీజేపీ. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ పడటానికి ఒప్పుకోలేదు. అలాంటిది రాజ్యసభ సభ్యత్వం ఇస్తే మాత్రం సంతోషంగా తీసేసుకున్నారు. ఇది చూసి సురేష్ పాత సినిమాల్ని కెలికి.. ఆయన్ని ఇరుకున పెట్టే వీడియో నెట్లో పెట్టి ప్రచారంలోకి తెచ్చారు ఆయన యాంటి ఫ్యాన్స్. ఈ వీడియో ప్రస్తుతం కేరళలో హాట్ టాపిక్ అవుతోంది. మలయాళ టీవీ ఛానెళ్లలోనూ ఈ వీడియో ప్రసారం కావడం విశేషం. మొత్తానికి యాక్షన్ హీరో పరువు మొత్తం గంగలో కలిపేస్తూ అతణ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.