Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు మూసేస్తున్న అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్

By:  Tupaki Desk   |   17 April 2021 11:00 PM IST
థియేట‌ర్లు మూసేస్తున్న అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్
X
క‌రోనా మ‌హ‌మ్మారీ మొద‌టి వేవ్ స‌మ‌యంలోనే థియేట‌ర్ రంగం చిక్కుల్లో ప‌డ‌బోతోంద‌ని చెప్పిన మొట్ట మొద‌టి మేధావి డి.సురేష్ బాబు. మునుముందు ఓటీటీల హ‌వా సాగుతుంది. థియేట‌ర్ల‌కు క‌ష్ట‌కాలం దాపురించింద‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించి షాకిచ్చారు. అయితే క‌రోనా ఏడాది పాటు కొన‌సాగాక డిసెంబ‌ర్ నుంచి తిరిగి థియేట‌ర్ల‌ను తెరిచారు. ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ కూడా అనూహ్యం. టాలీవుడ్ సినిమాలు వ‌రుస‌గా రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతుంటే అంతా సంతోషించారు. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిల‌వ‌నీయ‌లేదు సెకండ్ వేవ్.

ప్ర‌స్తుతం మ‌రోసారి సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతుండ‌డంతో థియేట‌ర్ల‌ను బంద్ చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. మెజారిటీ థియేట‌ర్ల‌తో డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌ను ర‌న్ చేస్తున్న అగ్ర నిర్మాత‌ డి.సురేష్ బాబు త‌న థియేట‌ర్ల‌ను మ‌రోమారు మూసేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఆయ‌న నిర్ణ‌యాన్ని మ‌రో నిర్మాత న‌ట్టి కుమార్ వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే.

అయినా కానీ చాలా చోట్ల సురేష్ బాబు త‌మ థియేట‌ర్ల‌ను మూసివేస్తున్నార‌ని తెలిసింది. దాదాపు 40-50 వ‌ర‌కూ థియేట‌ర్ల‌ను బంద్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాకినాడ‌లో ఐదారు.. విశాఖ‌లో కొన్నిటిని మూసివేశార‌ట‌.

ప్రస్తుతం థియేటర్లను నింపేందుకు సినిమాలు లేవు. దాదాపు అన్ని కేంద్రాల్లో సగటు కలెక్షన్ల కంటే ప‌డిపోయాయి. ఇటీవ‌ల విడుద‌లైన‌ వకీల్ సాబ్ వ‌సూళ్లు రెండో వారంలో త‌గ్గిపోయాయి. మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా క్రేజీ సినిమాలు వాయిదా ప‌డ‌డం ఇబ్బందిక‌రంగా మారింది.

ఈ సమయంలో చాలా థియేటర్లు మూసేస్తార‌ని ప్ర‌చార‌మవుతోంది. విశాఖపట్నంలో జ్యోతి థియేటర్ .. కాకినాడలోని ఆరు థియేటర్లు మూసివేశారు. అనేక ఇతర సింగిల్ థియేటర్ యజమానులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ప‌రిస్థితి వేరు. అయితే మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్క‌డా స‌మ‌స్య త‌ప్ప‌దు. ఈ స్థితిలో అధికారిక లాక్ డౌన్ లేకుండానే థియేటర్లు రెండవ వేవ్ కారణంగా మూసివేస్తార‌ని భావిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి సిద్ధంగా లేనందున సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా లేవన్న ప్ర‌చారం సాగుతోంది. మ‌రోసారి ఒక‌టి రెండు నెల‌లు ఓటీటీకే ప్రేక్ష‌కులు అంకిత‌మవుతార‌ని భావిస్తున్నారు.