Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఇదే పరిస్థితి : సురేష్‌ బాబు

By:  Tupaki Desk   |   15 April 2020 9:40 AM IST
కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఇదే పరిస్థితి : సురేష్‌ బాబు
X
టాలీవుడ్‌ లో కరోనా వల్ల నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో తీరేలా లేదంటూ సురేష్‌ బాబు షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే మునుపటి పరిస్థితి రావడం సాధ్యం అయ్యే పని కాదంటూ సురేష్‌ బాబు అన్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే షూటింగ్‌ లు ప్రారంభం అవుతాయేమో కాని థియేటర్లు మాత్రం ఓపెన్‌ అవ్వడానికి నెలలు సమయం పట్టవచ్చు అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం థియేటర్లు ఇంకా మల్టీ ప్లెక్స్‌ లు కలిపి 1850 ఉన్నాయి. అవన్నీ కూడా నెలల తరబడి మూతపడే ఉండనున్నాయని చెప్పుకొచ్చారు.

పరిస్థితులు యధాస్థితికి వచ్చేందుకు చాలా నెలల సమయం పట్టవచ్చు. ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్లకు రావడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు. కరోనాకు వ్యాక్సిన్‌ తయారు అయినప్పుడే ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపుకు వస్తారని సురేష్‌ బాబు అభిప్రాయ పడ్డారు. ఇండస్ట్రీలో మునుపటి స్థితి ఏర్పడాలంటే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చి వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావాలి. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని.. థియేటర్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు సమయంలో తీవ్రంగా నష్టపోయారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌ కు చాలా కీలకం అయిన ఈ సమ్మర్‌ సీజన్‌ లో కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే పరిస్థితి లేదు. పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి మరో ఆరు నెలల సమయం అయినా పడుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని సురేష్‌ బాబు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో పరిస్థితులు కుదుట పడాలంటే కరోనాకు వ్యాక్సిన్‌ త్వరగా రావాల్సిందే. అంతకు మించి మరో మార్గం ఏమీ లేదు.