Begin typing your search above and press return to search.

మల్టిప్లెక్స్ కష్టం..సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి మేలు!

By:  Tupaki Desk   |   21 April 2020 10:30 AM GMT
మల్టిప్లెక్స్ కష్టం..సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి మేలు!
X
కరోనావైరస్ విజృంభణతో ఎన్నో రంగాలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. వాటిలో సినీ రంగం కూడా ఉంది. షూటింగులు చాలా రోజులుగా నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమా రిలీజులు కూడా ఆగిపోయాయి. ముఖ్యంగా సినిమా థియేటర్ల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుంది?

ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకులు మునుపటిలాగా థియేటర్లకు క్యూ కడతారా అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. చాలా థియేటర్లు ఇప్పటికే నష్టాలలో ఉన్నాయని.. అవి శాశ్వతంగా మూతపడతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ విషయంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు సింగిల్ స్క్రీన్లకు ఢోకా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. సురేష్ బాబు చేతిలో చాలా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కరోనా క్రైసిస్ ముగిసిన తర్వాత మల్టిప్లెక్స్ స్క్రీన్ల కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ముందే సాధారణ స్థితికి వస్తాయని ఆయన అన్నారు.

"సింగిల్ స్క్రీన్ థియేటర్లను ప్రేక్షకులు సేఫ్ అని భావించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఒక మాల్ లో చాలామంది మధ్యలో నుంచి నడుస్తూ నాలుగో ఫ్లోర్ లో ఉన్న మల్టిప్లెక్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదని వారు భావించే అవకాశం ఉంది. అంతేకాదు. సింగిల్ స్క్రీన్ ఓనర్ల చేతిలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉన్నట్టే.. సినిమాకు కాకపోతే మరోదానికి వాడుకోవచ్చు. కానీ మల్టిప్లెక్స్ పరిస్థితి అలా ఉండదు. సినిమాలు లేకపోతే స్క్రీన్స్ ఖాళీగా ఉంచుకోవాలి" అన్నారు.