Begin typing your search above and press return to search.

#RAPO ని డైరెక్ట్ చేయబోతున్న స్టైలిష్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   13 Jun 2020 2:20 PM IST
#RAPO ని డైరెక్ట్ చేయబోతున్న స్టైలిష్ డైరెక్టర్...?
X
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంతున్నా అంతో ఇంతో లక్ కూడా ఉండాలని అంటుంటారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఆ కోవకే చెందుతాడు. 'అతనొక్కడే’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సురేందర్ రెడ్డి అలియాస్ సూరి. ఫస్ట్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తరవాత ఎన్టీఆర్ తో తీసిన 'అశోక్'.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన 'అతిథి' సినిమాలు పరాజయాలు చవి చూశాయి. ఆ తర్వాత ‘కిక్‌’ ‘ధృవ’ 'రేసుగుర్రం' లాంటి సినిమాలు తీసి సూపర్‌ హిట్స్ అందుకున్నాడు ఈ స్టైలిష్‌ డైరెక్టర్. ఈ క్రమంలో గతేడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో సురేందర్ రెడ్డి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. 'సైరా' సినిమా వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఆయన ఇంకా కొత్త మూవీ ప్రకటించలేదు. 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.

అప్పట్లో నాగ చైతన్య, అఖిల్, నితిన్, ప్రభాస్ లతో సురేందర్ రెడ్డి స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడని న్యూస్ వచ్చింది. కానీ అవి డిస్కషన్స్ గానే మిగిలిపోయాయి. ఇటీవల అల్లు అర్జున్ తో సూరి నెక్స్ట్ సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో ఇంతకముందు వచ్చిన 'రేసుగుర్రం' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో కలిసి 'పుష్ప' మరియు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత కొరటాల శివతో సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బన్నీ - సూరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ లేవని అర్థం అవుతోంది. ఇప్పుడు లేటెస్టుగా సురేందర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరోతో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అతనెవరో కాదు 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ ఫార్మ్ లో ఉన్న రామ్ పోతినేని.

'ఇస్మార్ట్ శంకర్' సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా 'రెడ్' సినిమా తర్వాత రామ్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ రామ్ కి నచ్చిందట. 'రెడ్' సినిమా రిలీజ్ అయిన వెంటనే సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ చేయాలని రామ్ పోతినేని భావిస్తున్నాడట. హీరోలను స్టైలిష్ గా ప్రజంట్ చేయడంలో సూరిని మించిన వారు లేరని ఇండస్ట్రీలో అంటుంటారు. ముందే స్టైలిష్ గా ఉండే రామ్ ని ఇంకెంత స్టైలిష్ గా చూపిస్తాడో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.