Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్..ఎన్నేళ్లకెన్నేళ్లకు

By:  Tupaki Desk   |   6 July 2018 1:30 AM GMT
పవన్ హీరోయిన్..ఎన్నేళ్లకెన్నేళ్లకు
X
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు.. సుప్రియకు కూడా తొలి సినిమానే. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి వచ్చిన తొలి.. ఏకైక కథానాయిక ఆమె. ఐతే లాంచింగ్ ఘనంగానే జరిగినప్పటికీ సుప్రియ మళ్లీ సినిమాల వైపు చూడలేదు. హీరోయిన్ గా కొనసాగడం ఇష్టం లేక సినిమాలు మానేసింది. కానీ సినిమాలతో మాత్రం ఆమె కనెక్షన్ కట్టవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున నిర్మించిన చాలా సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిందామె. అలాగే అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాల్లోనూ బిజీగా గడిపింది. ఇక ఆమె మళ్లీ తెరముందుకు రాదనే అనుకున్నారంతా. కానీ సుదీర్ఘ విరామం తర్వాత సుప్రియ మళ్లీ ముఖానికి రంగేసుకోవడం విశేషం.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో నటించిన 22 ఏళ్ల తర్వాత సుప్రియ మళ్లీ ఇప్పుడో సినిమా చేసింది. అదే.. గూఢచారి. ‘క్షణం’ తర్వాత అడివి శేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి కథ కూడా అతడిదే. అతనే సుప్రియ కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ రాసి.. ఆమెకు ఆఫర్ చేశాడు. ప్రత్యేకమైన పాత్ర కావడంతో సుప్రియ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించనుంది సుప్రియ. టీజర్ చూస్తే ఆమె పాత్రకు ఇందులో మంచి ప్రాధాన్యమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మరో తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రిలీజైన ‘గూఢచారి’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో సుప్రియ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి.