Begin typing your search above and press return to search.

మహేష్ బాబుకు 'సూపర్ స్టార్' ఫ్యామిలీ స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   9 Aug 2021 9:30 AM GMT
మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
మహేష్ బాబు.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉందని నమ్ముతారు సినీ అభిమానులు. సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో బాల నటుడిగా అడుగుపెట్టిన మహేష్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా మారిన మహేశ్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఈ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. మహేష్ నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. సేవా కార్యక్రమాలతో మనసున్న మంచి వ్యక్తిగా అంతే మంచి పేరు తెచ్చుకున్నారు. నేడు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తోటి నటీనటులు, రాజకీయ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు, అభిమానులు ఆయనకు విషెస్ అందిస్తున్నారు.

మహేష్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. సతీమణి నమ్రత శిరోద్కర్ - కొడుకు గౌతమ్ - కూతురు సితార - సోదరి మంజుల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మహేష్ బావ సుధీర్ బాబు మరియు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం తాము నటిస్తున్న సినిమాల ద్వారా స్పెషల్ విషెస్ అందించారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్రీదేవి సోడా సెంటర్''. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ పై విజ‌య్ చిల్లా - శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది.

జాతర నేపథ్యంలో మహేష్ బాబు కటౌట్ కి లైటింగ్ పెట్టినట్లుగా ఉన్న 'శ్రీదేవి సోడా సెంటర్' వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. ''సూరిబాబు లైటింగ్ ఎడితే నక్షత్రాలు ఊరికి దిగొచ్చినట్టే అని ఊరూరంతా అంటారు!! దానికి సూపర్ స్టార్ కటౌట్ సాక్ష్యం''అని ట్వీట్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఇందులో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ''హీరో'' చిత్ర బృందం కూడా ఓ పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలియజేశారు. ''ఎన్నో మిలియన్ల మంది హృదయాల్లో హీరోగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. 'హీరో' చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఇందులో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.