Begin typing your search above and press return to search.

'జాంబీరెడ్డి' కాంబోలో సూపర్ హీరో ''హను-మాన్'' సినిమా ప్రారంభం..!

By:  Tupaki Desk   |   25 Jun 2021 5:30 AM GMT
జాంబీరెడ్డి కాంబోలో సూపర్ హీరో హను-మాన్ సినిమా ప్రారంభం..!
X
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త తరహా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అ!' సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్.. ఇటీవల తేజ సజ్జా ను హీరోగా పరిచయం చేస్తూ 'జాంబీరెడ్డి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో మరో కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు ప్రశాంత్ వర్మ. ''హను-మాన్'' అనే పేరుతో ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్నాడు.

'జాంబీరెడ్డి' సినిమాతో సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసిన తేజ సజ్జా ను ''హను-మాన్'' చిత్రం కోసం హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ మరియు టైటిల్ టీజర్‌ కు విశేష స్పందన లభించింది. టాలెంటెడ్ డైరెక్టర్ మరో సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం హైదరాబాద్‌ లో 'హను-మ్యాన్' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మరో ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ క్లాప్‌ ఇచ్చారు. శివశక్తి దత్త మొదటి షాట్‌ కు గౌరవ దర్శకత్వం వహించారు.

''హను-మాన్'' చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌ లో హై టెక్నికల్ వాల్యూస్ విఎఫ్‌ఎక్స్‌ తో రూపొందించనున్నారు. స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం వర్క్ చేయనున్నారు.

భారతీయుల సూపర్ హీరో హనుమంతుడి పేరుతో వస్తున్న ఈ చిత్రంలో సూపర్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలు.. సూపర్ హీరో ఫైటింగ్ పవర్స్ - ఎలివేషన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. 'జోంబీ రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ - తేజా సజ్జా కాంబోలో వస్తున్న ''హను-మాన్'' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.